Suryanarayana Raju: జగన్ ప్రభుత్వంలో ప్రచారం ఎక్కవ... పని తక్కువ..
ABN , First Publish Date - 2023-02-22T13:35:36+05:30 IST
విజయవాడ: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినీతి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పాలద్రోలాలి
విజయవాడ: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు (Suryanarayana Raju).. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ (Jagan) ప్రభుత్వంలో ప్రచారం ఎక్కవ... పని తక్కువని ఎద్దేవా చేశారు. పేదలకు చేసిందేమీ లేకపోయినా అన్ని చేస్తున్నట్లు చెబుతున్నారని విమర్శించారు. కులాల ఆధారంగా కార్పొరేషన్‌లు, చైర్మన్‌లను పెట్టారని... నిధులు ఇవ్వడం మరిచారని ఆరోపించారు. పేదలను ఉద్దరించినట్లుగా ఎలా చెబుతారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా సీఎం జగన్ (CM Jagan) సొంత అవసరాలకు మళ్లించారని సూర్యనారాయణ రాజు విమర్శించారు. మహాశివరాత్రి రోజు శివుడిని అవమానించేలా పోస్ట్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ (BJP) అభ్యంతరం చెబితే... మంత్రులు సమర్ధించుకుంటూ మాట్లాడారని మండిపడ్డారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు (Salaries) ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం ఇదని.. ప్రభుత్వం వైఫల్యాలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ఉద్యోగస్తులు ఆవేదన చెబితే చర్యలు అంటున్నారని అన్నారు. ప్రజలు, ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కుల, మతాల వారీగా విభజించి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని, నిరుద్యోగ భృతి నేటికీ ఇవ్వడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని, జగన్మోహన్ రెడ్డి మాట తప్పి, మడమ తప్పి మోసం చేశారని సూర్యనారాయణ రాజు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించి... నిరసన తెలిపితే అరెస్టు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. పేదల బియ్యం దోచుకుని విదేశాలకు తరలిస్తున్నారని, వైసీపీ నాయకులు అటవీ శాఖ భూములను దోచుకున్నారని ఆరోపించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. అధికార పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడుతున్నారని, భయపెట్టి, బెదిరించి గెలవాలని చూస్తున్నారని అన్నారు. గురువారం బీజేపీ తరఫున ఎమ్మెల్సీ మాధవ్ (Madhav) నామినేషన్ వేస్తారన్నారు. బీజేపీ ఎమ్మెల్సీలను గెలిపించాలని కోరుతున్నామన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పాలద్రోలాలని.. కుటుంబ పార్టీల పెత్తనాన్ని తరమి కొట్టాలని పిలుపిచ్చారు. బీజేపీ, జనసేన పార్టీలను ఆదరించాలన్నారు. నీతివంతమైన పాలనకు నిదర్శనంగా పని చేసి చూపిస్తామని సూర్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు.