Chandrababu Arrest: చంద్రబాబుపై పెట్టిన కేసులు నిలబడవు..
ABN , First Publish Date - 2023-09-11T16:45:31+05:30 IST
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు డబ్బులు తీసుకున్నట్లు నిరూపణ కాలేదని మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి చెప్పారు. రిమాండ్ రిపోర్టులో చాలామంది ఉంటే కేసులో 37వ వ్యక్తిగా ఉన్న చంద్రబాబును ఎలా అరెస్టు చేశారో అర్థంకావడంలేదన్నారు.
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (AP Skill Development Case)లో చంద్రబాబు (Chandrababu) డబ్బులు తీసుకున్నట్లు నిరూపణ కాలేదని మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి (Former Advocate General Ramakrishna Reddy) చెప్పారు. రిమాండ్ రిపోర్టులో చాలామంది ఉంటే కేసులో 37వ వ్యక్తిగా ఉన్న చంద్రబాబును ఎలా అరెస్టు చేశారో అర్థంకావడంలేదన్నారు. ఈ కేసు బాబు విషయంలో నిలబడదని రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ చంద్రబాబు రిమాండ్ రిపోర్టును బట్టి చూస్తే ఏదైనా అలిగేషన్ ఉన్నప్పుడు, అదే అంశంలో 36 మంది బయట ఉండగా.. 37వ వ్యక్తిగా ఉన్న చంద్రబాబుపై ఎలాంటి అవిడెన్స్ లేకుండా ఆయనను అరెస్టు చేయడం సముచితంగా లేదని, రాజకీయ కక్షతోనే అరెస్టు చేసినట్లు కనబడుతోందన్నారు.
అయితే రెండేళ్ల తర్వాత చంద్రబాబును అరెస్టు చేయడం ఏంటని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మరొకటి చంద్రబాబే డైరెక్టుగా డబ్బు తీసుకున్నట్లు ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. రిమాండ్ రిపోర్టులో కూడా చంద్రబాబు డబ్బు తీసుకున్నట్లు ఎక్కడా లేదన్నారు. సెక్షన్లన్నీ నాన్ బెయిలబుల్ పెట్టారని, 409 సెక్షన్ పెట్టినందుకు ఆధారం కూడా చూపించాలని, ఆ డబ్బును దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు చూపిస్తేనే కేసు నిలుస్తుందని లేకపోతే నిలవదని రామకృష్ణారెడ్డి చెప్పారు. చంద్రబాబుపై ఇది రాజకీయ కక్ష చర్య తప్పితే ఇంకొకటి కాదన్నారు. రిమాండ్ రిపోర్టులో 36 మందిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ పరిస్థితిలో అదుపులోకి తీసుకుంది.. బెయిల్‌పై విడుదల చేసింది రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా లేదని.. ఇవన్నీ చూపించడంలో పోలీసులు విఫలమయ్యారని రామకృష్ణారెడ్డి అన్నారు.