Chandrababu: ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని నేను పథకం పెడితే...

ABN , First Publish Date - 2023-04-14T14:09:50+05:30 IST

కృష్ణా జిల్లా: వైసీపీ (YCP) దళిత వ్యతిరేక ప్రభుత్వమని, పాము తన గుడ్లు తిన్నట్టు.. తనకు ఓట్లేసిన వారిపైనే ఈ ప్రభుత్వం దాడులు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Chandrababu: ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని నేను పథకం పెడితే...

కృష్ణా జిల్లా: వైసీపీ (YCP) దళిత వ్యతిరేక ప్రభుత్వమని, పాము తన గుడ్లు తిన్నట్టు.. తనకు ఓట్లేసిన వారిపైనే ఈ ప్రభుత్వం దాడులు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా, గుడివాడలో చంద్రబాబు మాట్లాడుతూ ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడు అందర్నీ పిడిగుద్దులు గుద్దినట్టే.. ఎస్సీలను గుద్దుతున్నారన్నారు. దళిత కుటుంబాల్లో ఒకరికే అమ్మ ఒడి ఇస్తున్నారని, అన్ని కులాలకంటే ఎక్కువ పేదరికం ఎస్సీల్లోనే ఉందన్నారు. ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని తాను పథకం పెడితే.. దాన్ని జగన్ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ధరలు పెంచి ఎస్సీలపై భారం మోపారన్నారు. చరిత్రలో దళితులపై ఎప్పుడూ జరగనన్ని దాడులు ఇప్పుడే జరుగుతున్నాయన్నారు.

దళితులపై దాడులు ఈ స్థాయిలో జరుగుతాయనే ఆలోచన చేస్తే.. అంబేద్కర్ ఆనాడే దళితులపై దాడులు చేస్తే ఉరేయాలని చట్టం చేసేవారని చంద్రబాబు అన్నారు. దళిత డాక్టర్ మొదలుకుని.. దళిత డ్రైవర్ వరకు వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలను ఎదుర్కొన్నారన్నారు. వేధింపులు భరించలేక ఎస్సీ అధికారి అచ్చెన్న చనిపోతే.. సీఎం జగన్ ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో అసమానతలు తొలగించేలా అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించారన్నారు. అంబేద్కర్ భారత ప్రజల ఆస్తి... కేవలం ఎస్సీలకే అంబేద్కర్ నాయకుడు అన్నట్టుగా చూడడం సరికాదన్నారు.

ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఎన్టీఆరే అంబేద్కర్‌కు నిజమైన వారసుడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే నాటి కేంద్ర ప్రభుత్వం అంబేద్కరుకు భారత రత్న ప్రకటించిందన్నారు. దళితుడైన కేఆర్ నారాయణన్‌ను రాష్ట్రపతిగా గెలిపించింది టీడీపీయేనని, బాలయోగిని లోక్ సభ స్పీకరుగా చేశాం.. కాకి మాధవరావుని సీఎస్‌గా చేసిన ఘనత టీడీపీదేనని పేర్కొన్నారు. అలాగే దళితుల పట్ల అంటరానితనం నిర్మూలనకు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసింది కూడా టీడీపీయేనని అన్నారు. జస్టిస్ పున్నయ్య ఇచ్చిన 42 రికమెండేషన్లను ఆమోదించామన్నారు. వివక్ష చూపితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని నాటి టీడీపీ ప్రభుత్వంలో ఆదేశించామన్నారు. టీడీపీ దళితులకేం చేసిందనే విమర్శలు చేసే వారికి ఇదే మా సమాధానమన్నారు. అమరావతిలో భారీ అంబేద్కర్ విగ్రహం.. స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయించామని, కానీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జగజ్జీవన్‌రాం స్మృతి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా.. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులేమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు.

Updated Date - 2023-04-14T14:09:50+05:30 IST