CM Jagan: అంగన్వాడీలలో నాడు – నేడు పనులపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2023-04-20T15:59:22+05:30 IST
రాష్ట్రంలోని అంగన్వాడీలలో నాడు - నేడు పనులపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీలలో నాడు - నేడు పనులపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagamohan Reddy) గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా మారిన 10 వేలకు పైగా అంగన్వాడీల్లో పనులపై సీఎంకు అధికారులు వివరించారు. 45వేల అంగన్వాడీలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. అంగన్వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలన్నారు. ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్, టాయిలెట్లు ఇలాంటి సౌకర్యాలపై సమాచారం తెప్పించుకోవాలని ఆదేశించారు. ప్రతి అంగన్వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్వాడీల్లో ఉంచుకోవాలని సూచించారు.
గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఖాలీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని.. మహిళా శిశుసంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీచేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంపూర్ణపోషణ కింద పంపిణీ ప్రక్రియకు సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించాలని తెలిపారు. పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. సంపూర్ణ పోషణ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా చేయాలని చెప్పారు. అంగన్వాడీల్లో సూపర్ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని అధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.