AP News: మోదీని గద్దె దింపుదాం.. దేశాన్ని కాపాకుందాం..: సీపీఎం బాబూరావు
ABN , First Publish Date - 2023-04-23T13:42:11+05:30 IST
విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని గద్దె దింపుదామని, దేశాన్ని కాపాకుందాం అనే నినాదంతో సీపీఎం, సీపీఐ ప్రచార భేరి నిర్వహిస్తున్నాయి.
విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని గద్దె దింపుదామని, దేశాన్ని కాపాకుందాం అనే నినాదంతో సీపీఎం, సీపీఐ ప్రచార భేరి నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సీపీఎం నేత బాబూరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కును అమ్మడమంటే.. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయడమేనని, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల ఆస్తులను కార్పోరేట్ రంగ సంస్థలకు కట్టబెడుతున్నారని, మే 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళనల్లో సీపీఎం, సీపీఐ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మద్దతుగా పాల్గొంటున్నారని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని మోదీతో జత కట్టిన సీఎం జగన్.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని బాబూరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్‌ను కేసుల నుంచి మోదీ కాపాడుతున్నారని, ఈ ఇద్దరూ కలిసి ప్రజలపై భారాలు వేస్తూ.. జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా వైసీపీకి బీజేపీ కొమ్ము కాస్తూనే ఉందన్నారు. బీజేపీ తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఎపీని నాశనం చేసిందన్నారు. మోదీ తనను కాపాడతారనే ఆశతోనే.. జగన్.. కేంద్రంపై నోరు ఎత్తడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వైసీపీకి అంటకాగే బీజేపీపై ఆశలు వదులుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ తన బహిరంగ సభలోనే బీజేపీ తన నోరు మూయించిందని చెప్పారన్నారు. అటువంటి పార్టీతో పొత్తును వీడి.. జనంలోకి రావాలని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమించాలని బాబూరావు పిలుపిచ్చారు.
దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ...
ప్రధాని మోదీ వినాశకరమైన ఆలోచనలతో దేశాన్ని నాశనం చేస్తున్నారని, పేదల పొట్ట కొట్టి పారిశ్రామిక వేత్తలకు దోచి పెట్టడమే ప్రధాని పాలన తీరు ఉందని కాశీనాథ్ విమర్శించారు. మోదీ వేరు, జగన్ వేరు కాదని.. ఇద్దరూ కలిసే ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. కృష్ణపట్నం ఓడరేవు, గంగవరం, బీఎస్ఎన్ఎల్.. ఇలా అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్నారని.. అది కూడా కేవలం అదానీకే మొత్తం ఆస్తులన్నీ దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంపై నిజంగా ప్రేమ ఉంటే... ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీని వీడాలన్నారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని కాశీనాథ్ పిలుపిచ్చారు.