Baburao: మోదీ విధానాల వల్ల ఏపీ కూడా సర్వనాశనం అయింది..
ABN , First Publish Date - 2023-10-29T11:38:08+05:30 IST
విజయవాడ: నవంబర్ 15వ తేదీన చేపట్టనున్న ప్రజా రక్షణ భేరీ విజయవంతం చేయాలంటూ సీపీఎం నేతలు ప్రచార యాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో ఆ పార్టీ నేత బాబూరావు మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో ప్రజా రక్షణ భేరీ పేరుతో యాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు.
విజయవాడ: నవంబర్ 15వ తేదీన చేపట్టనున్న ప్రజా రక్షణ భేరీ విజయవంతం చేయాలంటూ సీపీఎం నేతలు ప్రచార యాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో ఆ పార్టీ నేత బాబూరావు మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో ప్రజా రక్షణ భేరీ పేరుతో యాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. దేశాన్ని కరోనా వదిలినా.. నరేంద్రమోదీ మాత్రం దేశానికి శనిలా పట్టి పీడిస్తున్నారని, ప్రధాని విధానాల వల్ల ఏపీ కూడా సర్వనాశనం అయిందని.. అయినా సీఎం జగన్ మోదీ ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. నిత్యావస వస్తువులు, ఇంటి పన్నులు, విద్యుత్ భారాలు పెరిగిపోయాయని, మోదీ, జగన్ పాలన కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టారని, మోదీ, జగన్‌లు కలిసి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని బాబూరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి చేయలేదని, ఏపీకి ప్రత్యేక హోదాపై మోసం చేశారని, ప్రజాస్వామ్యాన్ని జగన్ ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, జగన్‌లను వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టాలని ఆయన పిలుపిచ్చారు. తెలంగాణా ఎన్నికల ద్వారా బీజేపీ పతనం ప్రారంభమవడం ఖాయమన్నారు. బీజేపీతో జత కట్టిన పార్టీలకు కూడా ప్రజలు బుద్ది చెబుతారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయంలో ప్రధాని మోదీ పాత్ర ఉందని, అటువంటి వ్యక్తితో జగన్ జత కట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆలోచించాలని, బీజేపీ నుంచి బయటకు రావాలని బాబూరావు సూచించారు.
దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని, మతతత్వం, కులతత్వంతో దేశాన్ని పాలిస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. పాత తరహాలో అధ్యక్ష తరహా పాలన విధానంలోకి తీసుకెళుతున్నారని, అదానీ, అంబానీ కనుసన్నల్లో మోదీ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి మోదీ, జగన్‌లు పెద్ద శాపంగా మారారన్నారు. ప్రజలపై పదహారు వేల కోట్ల రూపాయల పన్ను భారాలు మోపారన్నారు. మోదీ పాదాల వద్ద కూర్చుని జగన్ జీ హుజూరు అంటూ తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, మోదీలను చిత్తు చిత్తుగా ఓడిస్తేనే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని దోనేపూడి కాశీనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.