CPM: చాలా సంక్లిష్ట పరిస్థితిలో ఏపీ... బీజేపీ ఓటమే లక్ష్యం
ABN , First Publish Date - 2023-02-13T10:38:36+05:30 IST
నగరంలోని సీపీఎం పార్టీ సొంత కార్యాలయాన్ని నిర్మించుకుంది.
విజయవాడ: నగరంలోని సీపీఎం పార్టీ సొంత కార్యాలయాన్ని (CPM party own office) నిర్మించుకుంది. సోమవారం ఉదయం సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఎ.బేబి (MA Bebi), బి.వి.రాఘవులు (BV Raghavulu) పార్టీ రాష్ట్ర సొంత కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బి.వి.రాఘవులు మాట్లాడుతూ... ఏపీ చాలా సంక్లిష్ట పరిస్థితిలో ఉందన్నారు. ఇక్కడ బీజేపీ (BJP)కి బలం లేకపోయినా ప్రధాన పార్టీలను వారు శాసిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనలు చేపడతామని తెలిపారు. మార్చిలో దేశ వ్యాప్తంగా లౌకికవాదం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఓటమే లక్ష్యంగా తాము పని చేస్తామన్నారు. భవిష్యత్తులో బీజేపీ వ్యతిరేకశక్తులను కలుపుకుని ముందుకు వెళతామని తెలిపారు. ఈ పార్టీ కార్యాలయం ద్వారా ఏపీ (Andhrapradesh) లో సీపీఎం పోరుబాట ఖరారు అవుతుందని పేర్కొన్నారు.
ఎంఏ.బేబి మాట్లాడుతూ... సీపీఎం పార్టీ సొంత కార్యాలయం ప్రారభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ పార్టీ కార్యాలయం ఒక వేదిక అవుతుందని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన సాగుతోందని విమర్శించారు. రైతులు, యువతను మోదీ (PM Narendra Modi) మాయ మాటలతో మోసం చేశారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం (Modi Government) ఆర్.యస్.యస్. కనుసన్నల్లోనే పని చేస్తోందని ఆరోపించారు. పేదల పొట్ట కొట్టి పెద్దలకు పెట్టడమే మోదీ పాలనా విధానమన్నారు. అనేక రాష్ట్రాల్లో ప్రజల ఆస్తులను అంబానీ (Ambani), అదానీ (Adani)లకు దోచి పెడుతున్నారని అన్నారు. ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో పాలకులు మోదీకి వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిని వ్యతిరేకిస్తే సీబీఐ (CBI), ఈడీ (ED) దాడుల పేరుతో భయపెడుతున్నారన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కూడా మోదీ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.