AP News: డాక్టర్ అచ్చన్న మృతిపై వీడిన మిస్టరీ
ABN , First Publish Date - 2023-03-27T10:20:56+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కడప జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటి డైరెక్టర్ అచ్చన్న మృతిపై మిస్టరీ వీడింది.
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కడప జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటి డైరెక్టర్ అచ్చన్న ( Animal Husbandry Department Deputy Director Atchanna) మృతిపై మిస్టరీ వీడింది. డిడి అచ్చన్న దారుణ హత్యకు గురైనట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు హత్య కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా కేసును చేధించారు. హత్యపై నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు పాల్పడ్డ నిందితులకు సంబంధించి ఎస్పీ అన్బురాజన్ మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
కాగా.. ఈనెల 12న కనిపించకుండా పోయిన అచ్చన్న 24న గువ్వలచెరువు ఘాట్‌రోడ్‌లో శవమై తేలిన విషయం తెలిసిందే. అయితే గత ఆరు మాసాలుగా పశుసంవర్థక శాఖ సిబ్బందికి, అచ్చన్నకు మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీనిపై సంబంధిత శాఖ డైరెక్టర్ వచ్చి కడపలో విచారణ చేపట్టి నివేదికను కమిషర్‌కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 12 నుంచి అచ్చన్న ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. అచ్చన్న కనిపించకుండాపోవడంపై అతని భార్య పిల్లలు ఈనెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఈనెల 24న అచ్చన్న డెడ్‌బాడీ కనిపించింది. అయితే అప్పటికే మృతదేహం కుళ్లుపోయిన స్థితిలో ఉండటంతో ఘటనా స్థలిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అప్పటి నుంచి విచారణ చేపట్టిన పోలీసులు చివరకు అచ్చన్నది హత్యగా తేల్చారు.
మరోవైపు అచ్చన్న మృతిపట్ల విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆయా సంఘాలు, విపక్షాలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు కొనసాగడంపై మేధావులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.