Nirmala Sitharaman: మోదీ పాలనలో వివిధ రూపాల్లో ప్రజలు లబ్ధి పొందారు
ABN , First Publish Date - 2023-12-09T14:43:43+05:30 IST
2014 నుంచి నేటి వరకు అన్ని సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ (PM Modi) పాలన చేస్తున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా: 2014 నుంచి నేటి వరకు అన్ని సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ (PM Modi) పాలన చేస్తున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. మైలవరం నియోజకవర్గం రాయనపాడులో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. అనంతరం కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దగ్గుబాటి పురందేశ్వరి, కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. ‘‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే నినాదంతో మోదీ ముందుకు సాగుతున్నారు. వివిధ పథకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అందించారు. వివిధ రూపాల్లో ప్రజలు లబ్ధి పొందారు. ఇంకా పథకాలు అందని వారు ఉంటే... వారు కూడా తీసుకునే విధంగా అవగాహన యాత్ర చేపట్టారు. నవంబర్ 15 నుంచి మోదీ గ్యారంటీ రథం పేరుతో హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. బ్యాంకులకు వెళ్లాలంటేనే పేదలు భయపడేవారు. ఇప్పుడు బ్యాంకర్లే పేదల దగ్గరకి వచ్చి జీరో అకౌంట్లు ఓపెన్ చేయించారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేశారు. పెద్ద పెద్ద దేశాల్లో కూడా అక్కడి ప్రభుత్వాలు ఈ విధానం అమలు చేయలేదు. అక్కడి పోస్ట్‌మెన్ల ద్వారా చెక్‌లు పంపించే వారు.’’ అని పేర్కొన్నారు.
‘‘మోదీ ఒక్క స్కీం ప్రారంభిస్తే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. జన్ ధన్ అకౌంట్ల ద్వారా దేశంలో అందరికీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ప్రతి పంచాయతీ పరిధిలో ప్రజలు ఈ రథం ద్వారా పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. ప్రజలకు అర్హత ఉండి పథకం రాకుంటే... వెంటనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 17 రకాల పథకాలు గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం మోదీ అమలు చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల ఉచిత వైద్యం. కోవిడ్ నుంచి ఉచిత బియ్యం ఇస్తున్నారు. మోదీ మరో ఐదేళ్లు ఇది పెంచారు. రైతుల కోసం పీఎం కిసాన్ ద్వారా ఆరు వేలు ఇస్తున్నారు. ఫర్టిలైజర్ బస్తా రెండు వేలు విలువ చేసేది రూ.266కే రైతులకు అందిస్తున్నారు. పీఎం విశ్వకర్మ పేరుతో చేతి వృత్తుల వారిని మోదీ ప్రోత్సహించారు.’’ అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.