Chandrababu: లగ్నం పెట్టుకుని ఎవరేంటో తేల్చుకుందాం.. చంద్రబాబు సవాల్..

ABN , First Publish Date - 2023-02-24T12:24:19+05:30 IST

కృష్ణా జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శుక్రవారం గన్నవరంలో పర్యటిస్తున్నారు.

Chandrababu: లగ్నం పెట్టుకుని ఎవరేంటో తేల్చుకుందాం.. చంద్రబాబు సవాల్..

కృష్ణా జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శుక్రవారం గన్నవరంలో పర్యటిస్తున్నారు. వైకాపా (YCP) మూకల దాడిలో ధ్వంసమైన టీడీపీ (TDP) కార్యాలయాన్ని, కాలిపోయిన, ధ్వంసమైన కార్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ‘సైకో (Psycho) పోవాలి.. సైకిల్ (Cycle) రావాలంటూ’ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారమే దాడులు జరిగాయని, వైసీపీ నేతలు (YCP Leaders) టెర్రరిస్టుల్లా (Terrorists) వ్యవహరిస్తున్నారన్నారు. దొంగ దెబ్బలు.. దొంగాటలు వద్దని, లగ్నం పెట్టుకుని ఎవరేంటో తేల్చుకుందామంటూ సవాల్ చేశారు. పోలీసులు లేకుండా వస్తే చూసుకుందామన్నారు. ధైర్యం ఉంటే సైకో కూడా రావాలన్నారు. పిచ్చి రౌడీ చేష్టలకు భయపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

గన్నవరం పాకిస్థాన్‌లో ఉందా? నన్ను పర్యటించొద్దు అనటానికి పోలీసులు ఎవరు? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఫిర్యాదు చేసినా ఇంతవరకూ గన్నవరం పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేయలేదని దుయ్యబట్టారు. చేసిన సిగ్గుమాలిన పనిపై పోలీసులు కుటుంబ సభ్యుల వద్ద అయినా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజా ఉద్యమ రూపకల్పనకు ప్రజలే శ్రీకారం చుట్టాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం చేసే ఉద్యమంలో అంతా ఐక్యం కావాలని చంద్రబాబు పిలుపిచ్చారు.

చావుబతుకుల మధ్య ఇన్ఛార్జ్ అర్జునుడు ఉంటే.. ఈ తరహా దాడి చర్యలను ఏ విధంగా సమర్ధించుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. ఉగ్రవాదుల కంటే ఘోరంగా వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బరితెగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని, ఎందరో మహానుభావులు పుట్టిన కృష్ణా జిల్లాలో సైకోలు స్వైరవిహారం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఎందరో అధికారులు జైలుకు పోయారన్నారు. తప్పుచేసి పోలీసులు అదే బాట పట్టొద్దని చంద్రబాబు హితవుపలికారు.

రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. బొంతు చిన్న ఇంటికి వెళ్లి పరామర్శించామని, బొంతు చిన్న, పట్టాభిరామ్ను పోలీసులు వేధించారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పద్ధతిగా వ్యవహరించామని, వైఎస్సార్, జగన్ పాదయాత్రలు చేసినా అనుమతించామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

తమ పార్టీ ఆఫీస్లపై దాడులు జరిగితే.. తిరిగి మమ్మల్నే జైలుకు పంపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆడబిడ్డలకు రక్షణ లేదని, ప్రజా ఉద్యమాలను రూపొందించి సైకో పాలనను తరిమికొట్టాలని పిలుపిచ్చారు. ఇలాగే ఉపేక్షిస్తే.. గన్నవరం మరో పులివెందుల అవుతుందన్నారు. వ్యవస్థలకు పట్టిన చీడపురుగులను నిర్మూలించాలని, ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డువేస్తామన్నారు. తమతో కలిసి రావాలని.. రాష్ట్రాన్ని కాపాడుకుందామని చంద్రబాబు పిలుపిచ్చారు.

Updated Date - 2023-02-24T12:25:28+05:30 IST