CM Jagan: వైఎస్‌ఆర్‌ లా నేస్తం.. ఇక ఏడాదికి రెండు సార్లు...

ABN , First Publish Date - 2023-02-22T16:15:10+05:30 IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్‌ లా నేస్తం నిధులను బుధవారం విడుదల చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్‌ నొక్కి సొమ్ము విడుదల చేశారు.

CM Jagan: వైఎస్‌ఆర్‌ లా నేస్తం.. ఇక ఏడాదికి రెండు సార్లు...

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) వైఎస్సార్‌ లా నేస్తం (YSR Law Nestham) నిధులను బుధవారం విడుదల చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్‌ నొక్కి సొమ్ము విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ లా విద్య పూర్తి చేసుకున్నవారికి నెలకు రూ.5 వేల చొప్పున అందజేస్తున్నామని, ఏపీ వ్యాప్తంగా 2,011 మంది జూనియర్ లాయర్లకు లబ్ధి కలుగుతుందన్నారు. వృత్తిలో ఊతమిచ్చేందుకే 'లా నేస్తం' అందజేస్తున్నామన్నారు. పాదయాత్రలో లాయర్ల కష్టాలు తెలుసుకున్నానని, వారికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు.

వైఎస్‌ఆర్‌ లా నేస్తం... ఇక ఏడాదికి రెండుసార్లు నిధులు విడుదల చేస్తామని సీఎం జగన్ తెలిపారు.

ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వృత్తిలో ఊతమిచ్చేందుకే లా నేస్తం పథకం ప్రవేశపెట్టామన్నారు. న్యాయవాది వృత్తిని ఎంచుకుని, మన రాజ్యాంగాన్ని, చట్టాన్ని చదువుకుని న్యాయవాదులుగా స్ధిరపడడాలని సీఎం ఆకాంక్షించారు. తొలుత మూడేళ్లు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్నది తన దృష్టికి తీసుకొచ్చారన్నారు.

ప్రభుత్వం చేసిన ఈ మంచి పని ద్వారా వాళ్ల మనసుల్లో ఒక స్ధానం ఉండాలని, ప్రభుత్వం తోడుగా నిలబడ్డం వల్ల డబ్బులేని పేదవాడికి సహాయం చేయగలుగుతారనే విశ్వాసం తనకు ఉందని సీఎం జగన్ అన్నారు. మూడున్నరేళ్లలో 4,248 మందికి లబ్ధి చేకూరిందని, ఈ పథకం ద్వారా ఈ మూడున్నరేళ్లలో లాయర్లను ప్రతినెలా ఆదుకున్నామని అన్నారు. అర్హులైన జూనియర్‌ న్యాయవాదులు ఈ పథకంలో కొనసాగుతున్నారని, వారికి ఇవాళ దాదాపు రూ.1 కోటికి పైగా జమ చేస్తున్నామన్నారు. ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి రెండు దఫాలుగా ఇచ్చేటట్టుగా నిర్ణయించామన్నారు.

ఈ పథకం కోసం లా సెక్రటరీకి నేరుగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో లా సెక్రటరీ మెయిల్‌ ఐడీకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. sec_law@ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

లా నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు...

ysrlawnestham.ap.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసుకోవచ్చునని, దరఖాస్తు చేసుకున్నవారి వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి శాచ్యురేషన్‌ విధానంలో లబ్ధిదారులను గుర్తిస్తామన్నారు. ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదన్న తపనతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఈ పథకంలో కూడా అంతే పారదర్శకంగా అడుగులు వేసే కార్యక్రమం చేస్తున్నామన్నారు. అందుకనే ఏడాదికి రెండు దఫాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-22T16:15:14+05:30 IST