Tirumala: తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి

ABN , First Publish Date - 2023-03-07T21:36:28+05:30 IST

తిరుమల (Tirumala)లో వేంకటేశ్వరస్వామి ఆలయానికి వాయువ్య దిశలో వెలసిన కుమారధార తీర్థ ముక్కోటి మంగ‌ళ‌వారం ఘనంగా జరిగింది.

Tirumala: తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి

తిరుమల: తిరుమల (Tirumala)లో వేంకటేశ్వరస్వామి ఆలయానికి వాయువ్య దిశలో వెలసిన కుమారధార తీర్థ ముక్కోటి మంగ‌ళ‌వారం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు టీటీడీ(TTD) విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకుల సహకారంతో ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్నం సాంబారు అన్నం, మజ్జిగ అన్నం, పులిహోర, మజ్జిగ, సాయంత్రం ఉప్మా, కిచిడి, తాగునీరు అందించారు. టీటీడీ విజిలెన్స్, పోలీస్, అటవీ విభాగాల సమన్వయంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థముక్కోటిని దర్శించి, స్నానమాచరిస్తే పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం.

ttddd.jpg

కుమారధార తీర్థ ప్రాశస్త్యం ఇదీ..

వరాహ, మార్కండేయ పురాణాల ప్రాకారం.. ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై ''ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు'' అని ప్రశ్నించారు.‘‘ యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను’’ అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి 'కుమర ధార' అనే పేరు వచ్చిందని టీటీడీ వివరించింది.

ఇక పద్మ, వామన పురాణాల ప్రకారం.. దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురిడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షత్తు కుమారస్వామి స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి 'కుమారధార' అనే పేరు స్థిరపడిందని టీటీడీ పేర్కొంది.

కుమారధార తీర్థ ముక్కోటికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు... ఈ ప్రత్యేక ఫోటోలు కూడా చూడండి

Updated Date - 2023-03-07T21:41:56+05:30 IST