ఏడుస్తూ డాబా పైకి వెళ్లిన కూతురు.. ఆమె వెనుకే పైకి వెళ్లిన తండ్రి.. కనీస కనికరం లేకండా..
ABN , First Publish Date - 2023-02-10T20:08:46+05:30 IST
కన్న కూతురన్న కనికరం లేకుండా అనుమానంతో కన్న కూతుర్నే చంపాలనుకున్నాడు. మద్యం మత్తులో ఇంటి పైనుంచి కిందకు తోసివేశాడు. వివరాలలోకి వెళితే...
గుంటూరు: కన్న కూతురన్న కనికరం లేకుండా అనుమానంతో కన్న కూతుర్నే చంపాలనుకున్నాడు. మద్యం మత్తులో ఇంటి పైనుంచి కిందకు తోసివేశాడు. వివరాలలోకి వెళితే... పల్నాడు జిల్లా (Palnadu District) యడ్లపాడు మండలం ఉన్నవ ఉదయపురి కాలనీకి చెందిన కూరాకుల వరప్రసాద్, శోభారాణిలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా 17 ఏళ్ళ పెద్ద కుమార్తె కావ్య గణపవరంలోని సీఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ (Intermediate) మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి రాగా ఆ సమయంలో స్నేహితుల నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడుతుండగా తండ్రి వరప్రసాద్ అనుమానంతో అబ్బాయిలతో మాట్లాడుతున్నావా అంటూ చేయి చేసుకున్నాడు. దీంతో కావ్య ఏడ్చుకుంటూ డాబాపైకి వెళ్ళగా తండ్రి వరప్రసాద్ కూడా డాబా పైకి వెళ్లి.. కుమార్తెతో గొడవపడ్డాడు. మద్యం సేవించి ఉన్న వరప్రసాద్ ఆవేశంలో కావ్యను డాబా పై నుంచి బలంగా కిందకు తోయడంతో కావ్య తీవ్రంగా గాయపడింది. గాయపడిన కావ్యను చికిత్స నిమిత్తం జీజీహెచ్ (GGH)కు తరలించారు. తల్లి శోభారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కారకుడైన వరప్రసాద్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.