TDP: సీఈవోతో టీడీపీ నేతల భేటీ.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-06-28T15:09:35+05:30 IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాతో టీడీపీ నేతలు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో అవకతవకలపై సీఈఓకు నేతలు ఫిర్యాదు చేశారు.

TDP: సీఈవోతో టీడీపీ నేతల భేటీ.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు

అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాతో (Chief Electoral Officer Meena) టీడీపీ నేతలు (TDP Leaders) బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో అవకతవకలపై సీఈఓకు నేతలు ఫిర్యాదు చేశారు. ఏకంగా 2150 ఇళ్ల నెంబర్లతో దొంగ ఓటర్లను చేర్పించారని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము చెప్పిన అంశాలతో సీఈఓ మీనా అంగీకరించారని సమావేశం అనంతరం టీడీపీ నేతలు తెలిపారు. బీఎల్వోలతో పాటు తమ పార్టీ కేడరును పంపాలని సీఈఓ సూచించారని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) తెలిపారు.

సమావేశం అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దొంగలు పడ్డారని అన్నారు. గత నాలుగేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం పంచభూతాలను దోచుచుకుందని ఆరోపించారు. చివరి ఏడాదిలో ఓట్లను దొంగతనం చేస్తున్నారని మండిపడ్డారు. 2019 తర్వాత జరిగిన వివిధ ఎన్నికల్లో మాన్యుపులేషన్ ద్వారానే వైసీపీ గెలిచిందని తెలిపారు. ఏపీలోని ఐదు కోట్ల మంది వ్యతిరేకిస్తున్నారని.. ఓటమి భయంతో ఓటర్ల జాబితాపై దొంగలు పడ్డారని అన్నారు. వలంటీర్ల ద్వారా ఈసీ నియమించిన బీఎల్ఓలను మ్యానుపులేట్ చేస్తూ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా ఓట్లను తప్పించేస్తున్నారని అన్నారు. ఒకే ఇంటిలోని ఓటర్లను రకరకాల బూత్‌లలో పెడుతున్నారన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై సీఈఓకు వివరించినట్లు చెప్పారు. 14 నియోజకవర్గాల్లో 2150 ఇళ్ల నెంబర్లతో 1.85 లక్ష ఓట్లు నిబంధనలకు విరుద్ధంగా దొంగ ఓట్లను నమోదు చేయించారని టీడీపీ నేత తెలిపారు.

తాము చెప్పినవన్నీ వాస్తవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంగీకరించారన్నారు. ప్రతి అంశంపైనా పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని సీఈఓ హామీనిచ్చారన్నారు. అక్టోబర్-17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఇస్తామన్నారని అన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ఏమైనా తేడా ఉంటే ఆధారాలను సమర్పించాలని సీఈఓ సూచించారన్నారు. జగన్ చెప్పారని.. వైసీపీ నేతలు చెప్పారని ఓటర్ల జాబితాలో అవకతవకలకు చేయొద్దని కోరారు. ఓటర్ల జాబితా విషయంలో కేడరును కూడా పంపించాలని సీఈఓ సూచించినట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో దేవినేని ఉమ, బోండా ఉమా వర్ల రామయ్య, నక్క ఆనందబాబులు సచివాలయంలో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-06-28T15:45:35+05:30 IST