Kottu satyanarayana: తిరుపతి హథీరామ్ జీ మఠానికి మరొకరిని బాధ్యులుగా నియమిస్తాం..

ABN , First Publish Date - 2023-06-08T14:33:42+05:30 IST

తిరుపతి హథీరాం జీ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్ దాస్ అనే వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడ్డారని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Kottu satyanarayana: తిరుపతి హథీరామ్ జీ మఠానికి మరొకరిని బాధ్యులుగా నియమిస్తాం..

అమరావతి: తిరుపతి హథీరాం జీ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్ దాస్ అనే వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడ్డారని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister kottu Satyanarayana) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారని అన్నారు. ప్రభుత్వానికి హథీరాంజీ మఠంపై ఎలాంటి హక్కులు లేకుండా అర్జున్ దాస్ కోర్టుకెళ్లారన్నారు. హథీరాం జీ మఠం ఆస్తుల్ని లీజులకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తేలిందని చెప్పారు. సన్యాసిగా ఉండాల్సిన మహంత్ అర్జున్ దాస్ వివాహం చేసుకుని పిల్లల్ని కూడా కన్నారని.. దీనిపై కమిటీని వేసి చర్యలు కూడా తీసుకున్నామన్నారు. అందుకే ధార్మిక పరిషత్ ద్వారా స్వామీ హథీరాం జీ మఠం మహంత్‌గా ఉన్న అర్జున్ దాస్‌ను సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామన్నారు. హథీరామ్ జీ మఠానికి మరొకరిని బాధ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు.

రాజశ్యామల యాగం మంచి ఫలితాన్నిచ్చింది...

మంత్రి ఇంకా మాట్లాడుతూ.. ఏపీలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ రాజశ్యామల యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయన్నారు. రాష్ట్రానికి నిధుల వరద అని మీడియాలో కథనాలు వచ్చాయని.. ఇది యజ్ఞఫలితమనే చెప్పటానికి దేవదాయశాఖ మంత్రిగా చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. శ్రీశైల క్షేత్రంలో కుంభాభిషేకం చేసేందుకు సంకల్పించినా ఉష్ణోగ్రతలు, వివిధ పరిస్థితుల కారణంగా వాయిదా వేశామన్నారు. కార్తీక మాసంలో నిర్వహించాలని సూచనలు వచ్చాయన్నారు. ఆలయాల ఆస్తుల అక్రమణ, లీజు గడువు ముగిసినా అన్యాక్రాంతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వీల్లేకుండా చట్ట సవరణ చేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.

Updated Date - 2023-06-08T15:05:22+05:30 IST