YCP: వైసీపీలో తెగని మైలవరం పంచాయితీ.. ప్రస్తుతం ఏం జరిగిందంటే..?
ABN , First Publish Date - 2023-02-07T17:52:26+05:30 IST
జిల్లాలోని మైలవరం వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (Mylavaram YCP MLA), మంత్రి జోగి రమేష్ ( Jogi Ramesh ) మధ్య వర్గపోరు చోటుచేసుకుంది.
ఎన్టీఆర్: జిల్లాలోని మైలవరం వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (Mylavaram YCP MLA), మంత్రి జోగి రమేష్ ( Jogi Ramesh ) మధ్య వర్గపోరు చోటుచేసుకుంది. వైసీపీ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్ దగ్గరకు మైలవరం పంచాయితీ చేరింది. గుంటూరులోని రాజశేఖర్ ఆఫీస్‌లో వైసీపీ నేతలు గొడవపడ్డారు. మైలవరం నేతలను ఎమ్మెల్యే వసంత మర్రిరాజశేఖర్ దగ్గరకు పంపారు. ఎమ్మెల్యేపై మంత్రి రమేష్ అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి జోగి రమేష్‌పై ఆరోపణలను ఆయన అనుచరులు ఖండించారు. మర్రి రాజశేఖర్ ఎదుటే బాహాబాహీకి మైలవరం వైసీపీ నేతలు దిగారు. గొడవను వీడియో తీస్తున్న విలేఖరి ఫోన్‌ను మర్రి రాజశేఖర్ పగలగొట్టినట్లు తెలిసింది.
గతంలో ఏం జరిగిందంటే..?
మైలవరంలో జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్ మధ్య వివాదం కొనసాగుతుండగానే... వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మరో చిచ్చు రేపారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ మరింత ఇరకాటంలోకి వెళ్ళారు. కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలు తన తండ్రి వ్యక్తిగతమని అందులో తనకు ఎటువంటి సంబంధం లేదని వసంత క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా వసంతను టార్గెట్‌గా చేసి పార్టీలో వివాదం చెలరేగింది. కమ్మ సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదని తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ ఎమ్మెల్యే వసంత మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహరంలో కూడా మంత్రి జోగి రమేష్ లేనిపోని విషయాలు ప్రచారం చేశారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా జోగి రమేష్ వర్గం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని చెబుతున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతున్నారని, ఎన్నికల నాటికి టీడీపీలో చేరతారని కూడా ప్రచారం చేసిందని టాక్. అందుకే వసంత కృష్ణ ప్రసాద్‌కు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారనే ప్రచారం కూడా జరిగింది.
మైలవరం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను స్థానిక గ్రూపు రాజకీయాలను క్లియర్ చేసి, అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర స్థాయి పరిశీలకులు, మర్రి రాజశేఖర్ వంటి నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా వసంత కృష్ణ ప్రసాద్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత... జోగి రమేష్ తన నియోజకవర్గంలో చేతులు పెట్టి గందరగోళ పరచడమేంటని నిలదీశారు. జోగి వైఖరి వలన నియోజకవర్గంలో పార్టీలో విభేదాలు వచ్చాయన్నారు.