YS Viveka Case: అవినాష్ బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా.. కేసుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-07-18T11:45:40+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. మంగళవారం ఉదయం సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే అవినాష్ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది.
న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Case)ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ సుప్రీంకోర్టులో (Supreme Court) వాయిదా పడింది. మంగళవారం ఉదయం సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే అవినాష్ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని సీబీఐ (CBI) కోరింది. దీంతో ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. సీబీఐని కౌంటర్ దాఖలు చేయడంతో పాటు తాజా చార్జిషీట్, కేసు ఒరిజినల్ ఫైల్‌ను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా.. అవినాష్ కేసుపై ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేక హత్య కేసు చాలా సీరియస్ అంశం అని పేర్కొంది. గంగిరెడ్డి, అవినాష్ బెయిల్ కలిపే వింటామని తెలిపింది. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని గంగిరెడ్డి తరపు న్యాయవాది కోరగా.. అవినాష్ రెడ్డి బెయిల్‌తో పాటు వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.
కాగా... వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణకు రాగా.. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీబీఐ కోరడంతో సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.