Yuvagalam Padayatra: రోషయ్య జ్ఞాపకాలతో మ్యూజియం: లోకేశ్
ABN , First Publish Date - 2023-05-08T21:22:33+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ ఆయనంటే తమకు ఎనలేని గౌరవం ఉండేదని నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు.
కర్నూలు: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ ఆయనంటే తమకు ఎనలేని గౌరవం ఉండేదని నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. రోశయ్య సీఎం అయ్యాక ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రత (సెక్యూరిటీ) పెంచారని గుర్తు చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు (Chandrababu), వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల మధ్య పెద్దవాదనలు జరిగినప్పుడల్లా రోశయ్య అనుసంధానకర్తగా ఉండేవారన్నారు. ఆయన మరణంతో ఆర్యవైశ్యులు పెద్దదిక్కును కోల్పోయారన్నారు. ఆర్యవైశ్యుల్లోనూ పేదలు ఉన్నారని చెప్పగానే రూ.30 కోట్ల నిధులతో ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. మచ్చలేని వ్యక్తిగా పేరొందిన రోశయ్య చనిపోతే సీఎం జగన్ (CM Jagan) కనీసం నివాళులర్పించేందుకు కూడా వెళ్లలేదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రోశయ్య జ్ఞాపకాలు, ఆయన చేసిన సేవల ఆనవాళ్లతో మ్యూజియం ఏర్పాటు చేస్తామని, భావితరాలకు స్ఫూర్తిని నింపుతామని లోకేశ్ వివరించారు.
లోకేశ్‌కు అపూర్వ స్వాగతం
యువగళం పాదయాత్ర 93వ రోజు సోమవారం కర్నూలు నగరంలో సాగింది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ టీజీ భరత్‌తో కలసి ఎన్‌ఆర్ పేట, కొత్తపేట, జిల్లా కోర్టు ఏరియా, కొండారెడ్డి బరుజు, పెద్దమార్కెట్, గడియారం ఆస్పత్రి ఏరియా, అమ్మవారిశాల, మండీబజారు, ఉస్మానియా కాలేజీ ఏరియా, కుమ్మరిగేరి, జమ్మిచెట్టు, జొహరాపురం, పుల్లయ్య కాలేజీ వరకు 8.8 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు నారా లోకేశ్ 1,178.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. నగర వీధుల్లో ప్రజలు భారీగా తరలివచ్చి యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. ఆయా కాలనీల్లో ప్రజలు, యువత, న్యాయవాదులు, మహిళలు లోకేశ్‌ను కలసి వినతి పత్రాలు అందజేశారు. చిన్న అమ్మవారిశాలలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో లోకేశ్ ప్రసంగించారు.