Nara Brahmani : పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనుకుంటున్న తరుణంలో బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్..
ABN , First Publish Date - 2023-09-29T13:30:38+05:30 IST
ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
అమరావతి : ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో నారా చంద్రబాబు అరెస్ట్, తర్వాత నారా లోకేష్‌ని కూడా అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో రాజకీయాల్లోకి బ్రాహ్మణి ఎంట్రీపై ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఆమె ఆసక్తికర ట్వీట్ చేశారు.
పరిశ్రమలు తరలిపోవడంపై ఏపీ ప్రభుత్వాన్ని ట్విటర్ వేదికగా నిలదీశారు. సులభతర వ్యాపారం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపి అందరూ గర్వపడేలా చేశారన్నారు. ఇప్పుడు అమర్ రాజా నుంచి లులు వరకూ ఎన్నో పరిశ్రమలు ఏపీ నుంచి తెలంగాణకు తరలిపోయాయన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులు ‘పుష్ అవుట్, పుల్ ఇన్’ సూత్రంలో భాగంగా ఏపీ నుంచి తరిమివేయబడి తెలంగాణకు లాక్కోబడుతున్న కారణాల ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. లులు, అమర్‌రాజ లాంటి కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోవడంపై ‘ది ప్రింట్’ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని తన ట్వీట్‌కు బ్రాహ్మణి జత చేశారు.