Nara Lokesh: వైసీపీ ఫేక్ ప్రచారంపై లోకేశ్ న్యాయ‌పోరాటం.. రెండు రోజులు పాదయాత్రకు బ్రేక్

ABN , First Publish Date - 2023-07-12T15:35:41+05:30 IST

టీడీపీపైన, టీడీపీ నేతలపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని గట్టిగా ప్రతిఘటించాలని తెలుగుదేశం నిర్ణయించింది. న్యాయపోరాటం చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు. గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి, పోతుల సునీత‌ల‌పై క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు చేశారు. మంగ‌ళ‌గిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Nara Lokesh: వైసీపీ ఫేక్ ప్రచారంపై లోకేశ్ న్యాయ‌పోరాటం.. రెండు రోజులు పాదయాత్రకు బ్రేక్

అమరావతి: టీడీపీపైన, టీడీపీ నేతలపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని గట్టిగా ప్రతిఘటించాలని తెలుగుదేశం నిర్ణయించింది. న్యాయపోరాటం చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) స్వయంగా రంగంలోకి దిగారు. గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి, పోతుల సునీత‌ల‌పై క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు చేశారు. మంగ‌ళ‌గిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి మంగళగిరి అడిషిన‌ల్ మేజిస్ట్రేట్ ముందు లోకేశ్ వాంగ్మూలం ఇవ్వ‌నున్నారు. ఆ కారణంగా ఈనెల 13, 14 తేదీలలో (రేపు, ఎల్లుండి) యువగళం పాదయాత్రకు బ్రేక్ పడనుంది.

త‌న‌పైనా, త‌న కుటుంబంపైనా అస‌త్య ఆరోప‌ణ‌ల‌ని ప్రచారం చేస్తున్న వైసీపీ నేత‌ల ఫేక్ ప్రచారంపై యువనేత నారా లోకేశ్‌ న్యాయ‌పోరాటం మొద‌లుపెట్టారు. గ‌తంలో త‌ప్పుడు వార్తలు రాస్తూ, త‌న‌ని అప్రతిష్టపాలు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న సాక్షిపై ప‌రువున‌ష్టం దావా వేయాలని నిర్ణయించారు. అనంత‌రం వైసీపీ నేత‌లు, సోష‌ల్ మీడియా బాధ్యులు కూడా త‌న‌ని టార్గెట్ చేస్తూ చేసిన అస‌త్య ప్రచారంపై క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్ డైరక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. లోకేశ్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య స‌మ‌స్యల‌తో బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహ‌త్యపై వైసీపీ సోష‌ల్ మీడియా కోఆర్డినేట‌ర్ గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు.

ఉమామహేశ్వరి మరణానికి జూబ్లీ రోడ్డు నెం.45 సర్వే నెం. 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణం అంటూ త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా విష‌ప్రచారం చేశారు. అయితే ఆ వివాదం, ఆ సర్వే నంబర్లూ ఫేక్ అని తేలింది. అయినా గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి మరో కట్టుకథ అల్లి ప్రచారంలో పెట్టారు. హెరిటేజ్‌లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రాతలు రాశారు. త‌ప్పుడు రాత‌లపై గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డికి త‌న లాయ‌ర్ దొద్దాల కోటేశ్వర‌రావు ద్వారా నోటీసులు పంపారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కో - ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ ఛీఫ్ డిజిటల్ డైరక్టర్‌గా ప‌నిచేస్తుండ‌డంతో ఆయా కార్యాల‌యాల‌కు నోటీసులు పంపగా.. వారు నిరాకరించారు. చివ‌రకి గుర్రంపాటికి వాట్స‌ప్ ద్వారా నోటీసులు పంపారు.

Updated Date - 2023-07-12T15:35:41+05:30 IST