Big Breaking : సాంకేతిక లోపం.. చివరి క్షణాల్లో ఆగిపోయిన గగన్‌యాన్ మిషన్
ABN , First Publish Date - 2023-10-21T09:10:52+05:30 IST
గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన తొలిదశ ప్రయోగం టీవీ-డీ1 (టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1) చివరి క్షణాల్లో ఆకస్మాత్తుగా ఆగిపోయింది. సాంకేతిక లోపంతో టెస్ట్ వెహికల్ ఆగిపోయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు..
గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన తొలిదశ ప్రయోగం టీవీ-డీ1 (టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1) చివరి క్షణాల్లో ఆకస్మాత్తుగా ఆగిపోయింది. సాంకేతిక లోపంతో టెస్ట్ వెహికల్ ఆగిపోయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ ప్రయోగం మళ్లీ ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే తేదీని ప్రకటిస్తామన్న ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఈ సాంకేతిక లోపంతో ప్రయోగానికి సర్వం సిద్ధమై.. ఇక ప్రయోగించడమే తరువాయి అన్నప్పుడు చివరి నిమిషంలో ఇస్రో శాస్త్రవేత్తలు హోల్డ్ చేశారు. కేవలం ఐదు సెకన్లలో నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా కొద్దిపాటి మంటలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం సాంకేతిక సమస్యను పరిశీలించే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు.
అసలేం జరిగింది..?
కాగా.. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి మరలా క్షేమంగా కిందకు తీసుకొచ్చే లక్ష్యంతో చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరుని ప్రదర్శించే తొలి టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 (టీవీ-డీ1) పరీక్షకు ఇవాళ 8 గంటలకు నింగిలోనికి పంపించాలని ఇస్రో సర్వం సిద్ధం చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల 8 గంటలు కాస్త 8.30 వరకూ పొడిగించింది. అయితే.. మంటలు రావడంతో ప్రయోగాన్ని హోల్డ్‌లో పెట్టాల్సి వచ్చింది. ఇవాళ్టికి మాత్రమే ఈ ప్రయోగం హోల్డ్‌లో పెట్టగా.. మళ్లీ ప్రయోగం చేపడుతామని ఇస్రో చైర్మన్ ప్రకటించారు. మానవ సహిత గగన్‌యాన్ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా మానవ రహితంగా ఇస్రో చేపడుతున్న కీలక ప్రయోగమిదనే విషయం తెలిసిందే.