Kotamreddy Sridhar Reddy : ‘ఏదో డాన్ ఇంటిని ముట్టడించినట్టు నా ఇంటిని ముట్టడిస్తారా?’ అంటూ పోలీసులపై కోటంరెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2023-04-06T08:24:07+05:30 IST

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్ అయ్యారు. పొట్టేపాళెం కలుజు వంతెన మరమ్మతులపై జలదీక్షకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి జలదీక్షకు అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు.

Kotamreddy Sridhar Reddy : ‘ఏదో డాన్ ఇంటిని ముట్టడించినట్టు నా ఇంటిని ముట్టడిస్తారా?’ అంటూ పోలీసులపై కోటంరెడ్డి ఫైర్

నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్ అయ్యారు. పొట్టేపాళెం కలుజు వంతెన మరమ్మతులపై జలదీక్షకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి జలదీక్షకు అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి ఎదుటే కోటంరెడ్డి దీక్షకు దిగారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కోటంరెడ్డి అనుచరులు నినాదాలు చేస్తున్నారు.

అయితే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్‌కు ముందు హైడ్రామాయే నడిచింది. కోటంరెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు.. నేరుగా తలుపులు నెట్టారు. దీంతో పోలీసులపై కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. ‘ఏదో డాన్ ఇంటిని ముట్టడించినట్టు నా ఇంటిని, మాగుంట లే అవుట్ మొత్తం రౌండప్ చేస్తారా?’ అంటూ ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా దీక్ష చేస్తానని తేల్చి చెప్పారు. ‘మీరు డ్యూటీలు‌ మాని ఎంతో కాలం నా వెనుక తిరగలేరు’ అని స్పష్టం చేశారు. ఎస్పీ, డీఎస్పీని అనుమతి కోరానని.. ఏదైనా ఉంటే తనను క్లారిఫికేషన్ అడగొచ్చన్నారు. వంతెన నిర్మాణానికి సీఎం ఫైల్ మీద సంతకం చేశారని.. జీవో ఇప్పిస్తే... వచ్చి పూలమాల వేస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు.

నెల్లూరు-తాటిపర్తి రహదారి పొట్టేపాళెం వద్ద కలుజుపై వంతెన నిర్మాణం కోసం గురువారం జలదీక్ష నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కలుజులోని నీళ్లలో కూర్చొని నిరహార దీక్షతో తన నిరసన తెలియజేస్తానని చెప్పారు. ఏడాదిన్నర క్రితం సీఎం జగన్‌ ఈ ప్రాంతంలో పర్యటించి వివిధ పనుల నిమిత్తం రూ.28 కోట్లు మంజూరు చేశారని, కానీ ఇప్పటికీ రూపాయి ఇవ్వలేదని చెప్పారు. జలదీక్ష నిర్వహణకు పోలీసు, ఇతరశాఖల అధికారులను అనుమతులు కోరానని, అనుమతులు వచ్చినా, రాకున్నా దీక్ష నిర్వహించి తీరుతానని స్పష్టం చేశారు. కానీ కలుజు వద్దకు వెళ్లకుండానే కోటంరెడ్డిని అడ్డుకున్నారు.

Updated Date - 2023-04-06T08:46:43+05:30 IST