NIA Raids: ఎన్‌ఐఏ సోదాలపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీరాములు ఏమన్నారంటే?..

ABN , First Publish Date - 2023-10-02T10:27:15+05:30 IST

కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీరాములు ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.

NIA Raids: ఎన్‌ఐఏ సోదాలపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీరాములు ఏమన్నారంటే?..

అనంతపురం: కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీరాములు ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు (NIA Raids) నిర్వహించారు. ఈ సోదాలపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ...తమ ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు చేస్తున్నారని.. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా అని అడుగుతున్నారని తెలిపారు. తమ ఇంట్లో పత్రాలు పరిశీలిస్తున్నారన్నారు. అంబేడ్కర్ బుక్స్ ఎందుకు చదువుతున్నారు అని అడిగారన్నారు. మళ్ళీ 6వ తేదీ హైదరాబాద్ ఎన్‌ఐఏ ఆఫీస్‌కు రమ్మన్నారని చెప్పారు. మొత్తం 8 మంది అధికారులు సోదాలు చేస్తున్నట్లు శ్రీరాములు తెలిపారు.


కాగా.. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున గుత్తి రోడ్డులోని బిందెల కాలనీలో నివాసం ఉంటున్న శ్రీరాములు ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. కుటుంబ సభ్యులు మినహా మరెవ్వరిని ఇంటి సమీపంలోకి అనుమతించని పరిస్థితి. సోదాల్లో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీరాములు ఇంట్లో బీరువాను ధ్వంసం చేసి విప్లవ సాహిత్యంతో పాటు ఇతర పత్రాలు ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. ఎన్‌ఐఏ సోదాలతో ఒక్కసారిగా బిందెల కాలనీ పరిసర ప్రాంతాల్లో కలకలం చెలరేగింది.


మరోవైపు ఏపీలో పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. పౌరహక్కుల నేతల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. పౌరహక్కుల నేతలను ఇళ్లలోనే ఎన్ఐఏ విచారిస్తోంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, రాజమండ్రి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎన్ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలియవచ్చింది.

Updated Date - 2023-10-02T10:27:15+05:30 IST