Pattabhi: పట్టాభి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి..

ABN , First Publish Date - 2023-02-21T21:27:05+05:30 IST

విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ను హత్య చేయడానికి టీడీపీ నేతలు పట్టాభిరాం (Pattabhi Ram)‌, దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు యత్నించారు.

Pattabhi: పట్టాభి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి..

విజయవాడ: ‘‘విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ను హత్య చేయడానికి టీడీపీ నేతలు పట్టాభిరాం (Pattabhi Ram)‌, దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు యత్నించారు. అందుకోసం కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. పోలీసులు వైసీపీకి తొత్తులుగా ఉన్నారని అవమానించారు’’ అని రిమాండ్‌ రిపోర్టు (Remand Report)లో గన్నవరం పోలీసులు పేర్కొన్నారు. పట్టాభితోపాటు 13 మందిని కోర్టులో హాజరుపరచిన తర్వాత కోర్టుకు రిమాండ్‌ రిపోర్టును సమర్పించారు. దళిత వర్గానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌ కనకరావును హత్య చేయడానికి ఈ ముగ్గురు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పేర్కొన్నారు.

‘‘ఇన్‌స్పెక్టర్‌ పొగిడి కనకారావు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించుచున్నారు. ఆయన మాల సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. సాయంత్రం ఐదు గంటలకు జాతీయ రహదారికి పక్కన ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతుందన్న సమాచారాన్ని అందుకున్నారు. అక్కడికి సిబ్బందితో కలిసి వెంటనే బయలుదేరారు. అక్కడికి వెళ్లగానే పోలీసులపై కొమ్మారెడ్డి పట్టాభి చాలా దురుసుగా ప్రవర్తించారు. దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు జనంతో అక్కడ గూమిగూడి ఉన్నారు. పట్టాభి పోలీసులను చేతులతో నెట్టేశారు. పట్టాభి, చిన్నా, వెంకటేశ్వరరావు గన్నవరంలో ఇతరులను రెచ్చగట్టే విధంగా వ్యవహరించారు. పోలీసులను తూలనాడి అవమానించారు. కనకారావు లోగడ ఎస్‌ఐగా గన్నవరంలో పనిచేశారు. ఈ ముగ్గురు తమ చేష్టల ద్వారా ఇన్‌స్పెక్టర్‌ను చంపాలనుకున్నారు. జాస్తి ఆదిశేషు, అట్లూరి రామ్‌కిరణ్‌, లావు వంశీకృష్ణ, చాగల్లగుళ్ల సందీప్‌ చౌదరి, గురువిందగుంట దేవేదర్‌, కోనేరు సందీప్‌, ముప్పరాజు కన్న కార్తీక్‌, వీరంకి వెంకటమూర్తితోపాటు కొంతమంది రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో కనకరావు తలకు గాయమైంది. అంతేగాకుండా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. గాయాలతో ఉన్న కనకరావును పోరంకిలో ఉన్న క్యాపిటల్‌ ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం ఆయన ఐసీయూలో అపస్మారకస్థితిలో ఉన్నారు’’ అని వివరించారు.

Updated Date - 2023-02-21T21:27:06+05:30 IST