AP News: పవన్ కాపులకు మాత్రమే నాయకుడు కాదు: హరిరామజోగయ్య
ABN , First Publish Date - 2023-06-23T21:21:49+05:30 IST
కాపులకు ఏకైక నాయకుడిగా ఉండాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తాపత్రయ పడుతున్నారని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య (Hariramajogaiah) విమర్శించారు.
పాలకొల్లు: కాపులకు ఏకైక నాయకుడిగా ఉండాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తాపత్రయ పడుతున్నారని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య (Hariramajogaiah) విమర్శించారు. ఇటీవల ముద్రగడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు రాసిన మొదటి లేఖతో జనసైనికులు చెంపలు వాయించే సమాధానం ఇచ్చినా, ముద్రగడ వైఖరి మారలేదన్నారు. పవన్ మీద బురద చల్లి సీఎం జగన్‌కు ఉపయోగ పడటమే ముద్రగద ఏకైక లక్ష్యంగా కనపడుతోందని జోగయ్య తప్పుబట్టారు. పవన్ కాపులకు మాత్రమే నాయకుడుకాదని, పవన్ అన్ని వర్గాల నాయకుడని తెలిపారు. పీఠాపురంలో ముద్రగడ మీద పవన్ పోటీ చేయనవసరం లేదని, సామాన్య జనసైనికుడు ముద్రగడను ఓడిస్తాడని, ఆయన రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
కాపుల రిజర్వేషన్లకు ముద్రగడ కిర్లంపూడిలో దీక్ష పేరుతో హడావుడి చేసిన సందర్భంలో తాను రాష్ట్ర మంత్రిగా ఉండి జీవో 30ను విడుదల చేయించడం జరిగిన సంగతి గుర్తు చేశారు. ఆ జీవోను మాజీ సీఎం రాజశేఖరరెడ్డి నిర్వీర్యం చేస్తే ముద్రగడ ఎందుకు మాట్లాడలేదని జోగయ్య ప్రశ్నించారు. అలాగే తునిలో జరిగిన ఆందోళన ఆనాటి ప్రతిపక్ష నేత జగన్ ప్రోద్భలంతోనే మీరు చేయించారా? అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి ఘటనలు జరిపించినట్టు భావించవలసి వస్తోందని జోగయ్య పేర్కొన్నారు. జగన్ రాసి ఇచ్చిన స్ర్కిప్టును ముద్రగడ అమలు చేస్తున్నారని హరిరామజోగయ్య దుయ్యబట్టారు.