Pawan Kalyan : మురళీధరన్‌తో పవన్ భేటీ.. 15 నిమిషాల పాటు సాగిన చర్చ
ABN , First Publish Date - 2023-07-19T12:37:20+05:30 IST
ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయనతో పాటు నాదేండ్ల మనోహర్ కూడా ఉన్నారు. మురళీధరన్‌తో కలిసి అల్పాహార సమావేశం నిర్వహించారు. 15 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య రాజకీయాలపై చర్చ జరిగింది. నేడు పవన్ మరికొందరు బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉంది.
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయనతో పాటు నాదేండ్ల మనోహర్ కూడా ఉన్నారు. మురళీధరన్‌తో కలిసి అల్పాహార సమావేశం నిర్వహించారు. 15 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య రాజకీయాలపై చర్చ జరిగింది. నేడు పవన్ మరికొందరు బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉంది.
కాగా.. నిన్న పవన్ ఢిల్లీలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కలిసి పోటీ చేసే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జాతీయ మీడియాతో జనసేనాని మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కూటమిలో ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల ఫలితాల్లో బలాబలాలను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విచ్చల విడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
ఉద్యోగాలు లేవని.. 1న జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. డేటా చోర్యం జరుగుతోందని తెలిపారు. రోజుకి రూ.160 జీతం ఇచ్చి పెట్టుకున్న ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రజల డేటా అంతా చోర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆధార్, వేలిముద్రలు, ఐరిష్ డేటా అంతా తెలంగాణలో నిక్షిప్తం చేస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేకతను ఎదురించే వారు కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అందుకే జనసేనకు ఏపీలో ప్రజల నుంచి మద్దతు వస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహతో ఉన్నారన్నారు. మీడియాలో కనిపిస్తున్న దానికి వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని చెప్పారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్నారు. తనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రం పది శాతం వడ్డీతో రుణాలు తీసుకొచ్చి రాష్ట్ర సొమ్మును ధారాదత్తం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.