Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. శరత్ చంద్ర అప్రూవర్‌గా మారడంతో..
ABN , First Publish Date - 2023-06-07T12:57:17+05:30 IST
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు అయ్యింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scame Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (MP Magunta Srinivasulu reddy) కుమారుడు మాగుంట రాఘవకు (Magunta Raghava) బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి (Arabindo Pharma Director Sharath Chandra Reddy) అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో రాఘవకు ఉపశమనం లభించినట్లైంది. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) రాఘవకు బెయిల్ మంజూరు చేసింది. తన భార్య అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ మంజూరీ చేయాలని హైకోర్టును రాఘవ కోరారు. రాఘవ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. రాఘవ భార్య హాస్పిటల్ రికార్డులను పరిశీలించిన తరువాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ (ED) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్‌లో (South Group) కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.
కాగా... ఈ కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy) అప్రూవర్‌గా మారుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్రూవర్‌గా (Approver) మారుతానని శరత్ ముందుకు రావడాన్ని ఈడీ కూడా అంగీకరించింది. అయితే.. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారటాన్ని వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ (AAP) పార్టీ సవాల్ చేస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో ఆప్ నేతలు (AAP Leaders) సంప్రదింపులు చేస్తున్నారు. త్వరలోనే రౌజ్ అవెన్యూ కోర్టులో (Rouse Avenue Court) ఆప్ పిటిషన్ దాఖలు చేయనున్నది. లిక్కర్ కేసుకు సంబంధించి అనేక కీలక అంశాలను ప్రత్యేకించి శరత్ చంద్రారెడ్డికి సంబంధించి గతంలో దర్యాప్తు సంస్థలు ఆయనపై మోపిన అభియోగాలు సహా పలు కీలక అంశాలను పిటీషన్‌లో ప్రస్తావించేందుకు ఆప్ సిద్ధమైంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ టార్గెట్‌గానే లిక్కర్ కేసులో పరిణామాలు జరుగుతున్నాయని ఆప్ నేతలు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక కోర్టులో సవాల్ చేయాలని ఆప్ భావిస్తోంది.