Rains: 15 నుంచి ఏపీలో వర్షాలు
ABN , First Publish Date - 2023-03-11T20:57:58+05:30 IST
ప్రస్తుతం బిహార్ (Bihar) నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ (Telangana) మీదుగా కర్ణాటక వరకూ కొనసాగుతున్న పశ్చిమ ద్రోణి ఈ నెల 15వ తేదీ నాటికి..
విశాఖపట్నం: ప్రస్తుతం బిహార్ (Bihar) నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ (Telangana) మీదుగా కర్ణాటక వరకూ కొనసాగుతున్న పశ్చిమ ద్రోణి ఈ నెల 15వ తేదీ నాటికి తూర్పు వైపుగా పయనించనున్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పడమర దిశ నుంచి వచ్చే గాలులు, బంగాళాఖాతం మీదుగా వీచే తూర్పుగాలుల కలయికతో ఈనెల 15 నుంచి కోస్తా, రాయలసీమ, తమిళనాడు (Rayalaseema Tamil Nadu), తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), విదర్భ తదితర ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా.. పశ్చిమ ద్రోణి మరింత బలపడే అవకాశం ఉన్నందున ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరి, మిరప, ఇతర పంటలకు వర్షం వల్ల నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని రైతులకు సూచించింది. సాధారణంగా మార్చి నుంచి ఏప్రిల్ వరకు పశ్చిమ ద్రోణుల ప్రభావంతో మధ్య భారతం దానికి ఆనుకుని ఏపీ, తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అందువల్ల రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.