Red Alert : ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

ABN , First Publish Date - 2023-07-26T03:31:51+05:30 IST

కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో బుధవారం కుంభవృష్టి కురిసే అవకాశముంది. ఈ మేరకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతోపాటు పిడుగులు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బాపట్ల,

Red Alert : ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

  • నేడు కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్‌, పశ్చిమ, అల్లూరి జిల్లాల్లో కుంభవృష్టి

  • 13 జిల్లాలకు ఆరెంజ్‌, 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

  • బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

  • నేడు వాయుగుండంగా మారే చాన్స్‌

  • నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

  • గెడ్డలు, వాగులు పొంగే అవకాశం

  • మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌: కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో బుధవారం కుంభవృష్టి కురిసే అవకాశముంది. ఈ మేరకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతోపాటు పిడుగులు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అనంతపురం, కడప, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది బుధవారానికి వాయుగుండంగా మారనుంది. తరువాత ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా వాయువ్య దిశలో పయనిస్తూ మధ్య భారతం వైపు వెళ్లనుంది. దీనికితోడు విశాఖపట్నం మీదుగా తూర్పు, పడమర ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా గొలుగొండలో అత్యధికంగా 103.5మి.మీ., విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 80మి.మీ., విశాఖ జిల్లా మధురవాడలో 55.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. మంగళవారం రాత్రినుంచి బుధవారం ఉదయం వరకు అనేక చోట్ల అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అసాధారణ వర్షపాతం నమోదు కానుంది. బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు కురవనున్నాయి. బుధవారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల ఈదురుగాలులు వీస్తాయని, గెడ్డలు, వాగులు పొంగే అవకాశం ఉన్నందున పశువులు, గొర్రెల కాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. 28 లేదా 29నుంచి గోదావరికి వరద పెరిగే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు హెచ్చరించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45నుంచి55, అప్పుడప్పుడు 65కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.


పోలవరం నుంచి 7.6 లక్షల క్యూసెక్కులు విడుదల..

పోలవరం ప్రాజెక్టులో గోదావరి నీటిమట్టం నిలకడగా ఉంది. పోలవరం స్పిల్‌వే నుంచి 7,60,138 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఈఈ పి.వెంకటరమణ తెలిపారు. పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం చుట్టూ వరద జలాలు ఆక్రమించాయి.

కృష్ణమ్మ పరవళ్లు..

ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 50వేల క్యూసెక్కుల వరద రావొచ్చన్న అంచనాతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఇన్‌ఫ్లో 8,241 క్యూసెక్కులు ఉంది. బ్యారేజ్‌ 16 గేట్లను అడుగు మేరకు ఎత్తి 10,360 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. బుధవారం ఉదయానికి మున్నేరు నుంచి 40వేలు, కీసరు నుంచి 7వేలు, పాలే రు నుంచి 24, మఽధిర నుంచి 5వేల క్యూసెక్కులు బ్యారేజీకి చేరుతుందని బులెటిన్‌ విడుదల చేశారు.

చేలన్నీ చెరువులే!

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లావ్యాప్తంగా వేసిన వరినాట్లు దెబ్బతిన్నాయి. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వరి నారు మళ్లు, అప్పుడే నాటిన వరి చేలు నీట మునిగిపోయాయి. మళ్లీ నారు మళ్లు పోసుకోవల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

బుధవారం ఉదయం నుంచి 24 గంటలపాటు అనేక జిల్లాలో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


2rainff-path.jpg

అత్యంత భారీ వర్షాలు

భారీ నుంచి అతి భారీ వర్షాలు

భారీ వర్షాలు

పిడుగులు

గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు

Updated Date - 2023-07-26T03:31:51+05:30 IST