Nara Yuvagalam Navasakam meeting: 2014 నాటి సీన్ రిపీట్.. ఒకే వేదికపై చంద్రబాబు, పవన్.. ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం..
ABN , Publish Date - Dec 20 , 2023 | 06:07 PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. 2014 నాటి సీన్ రిపీట్ అయ్యింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దాదాపు పదేళ్ల తర్వాత ఒకే ఉమ్మడి బహిరంగ వేదికను పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. 2014 నాటి సీన్ రిపీట్ అయ్యింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దాదాపు పదేళ్ల తర్వాత ఒకే ఉమ్మడి బహిరంగ వేదికను పంచుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం ముగింపు సభ ‘యువగళం నవశకం’ బహిరంగ సభ ఇందుకు వేదికైంది. చివరిసారిగా 2014 ఎన్నికల సమయంలో అధినేతలు ఇద్దరూ ఒకే సభలో పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పవన్, చంద్రబాబు వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే బహిరంగ వేదికను పంచుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ, జననసే కార్యకర్తల్లో నూతనోత్సహం నిండింది.
ఇక 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. జనసేన మిత్రపక్షంగా కొనసాగినప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తడం, ఆ తర్వాత దూరమవ్వడం జరిగిపోయాయి. ఇక రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ-జనసేన నిర్ణయించడంతో అధినేతలు మరోసారి బహిరంగ వేదికను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వేడి మొదలైన వేళ ఇది అత్యంత కీలకమైన పరిణామమని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. టీడీపీ-జనసేన అధినేతలు ఎన్నికల శంఖారావాన్ని పూరించి జగన్ సర్కారుకు సవాలు విసిరారని విశ్లేషిస్తున్నాయి.