Gone prakashrao: భారతి కోసమే జగన్ వారిని దూరం పెట్టారు.. గోనె ప్రకాష్‌ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-25T13:14:43+05:30 IST

సతీమణి భారతి కోసమే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను సీఎం జగన్ మోహన్ రెడ్డి దూరంగా పెట్టారని సీనియర్ నేత గోనెప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gone prakashrao: భారతి కోసమే జగన్ వారిని దూరం పెట్టారు.. గోనె ప్రకాష్‌ సంచలన వ్యాఖ్యలు

అమరావతి: సతీమణి భారతి (YS Bharati) కోసమే తల్లి విజయమ్మ (YS Vijayamma), చెల్లి షర్మిలను (YS Sharmila) సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) దూరంగా పెట్టారని సీనియర్ నేత గోనెప్రకాష్ రావు (Gone Prakash rao)సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను జైలుకు వెళ్తే భార్య భారతిని సీఎం చేయాలనేదే జగన్ వ్యూహమన్నారు. షర్మిల పోలీసులను కొట్టారని తానో వీడియోలో చూశానని.. చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని చెప్పుకొచ్చారు. ‘‘షర్మిల నా కూతురు లెక్క.. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడను’’ అని తెలిపారు. షర్మిల రోడ్డెక్కడానికి కారణం ఎవరు..? జగన్ కాదా అని ప్రశ్నించారు. షర్మిల పక్క రాష్ట్రానికి వెళ్లి పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. జగన్ షర్మిలను చిత్రహింసలు పెడుతున్నారన్నారు. ఏపీలోని ఓ సిట్టింగ్ ఎంపీ షర్మిలను కలిశారని.. ఆమెకు సాయం కింద రూ.5 కోట్లు ఇస్తామన్నారని తెలిపారు. అయితే ఆ విషయం తెలుసుకున్న జగన్.. సదరు ఎంపీకి ఫోన్ చేసి.. ఎందుకెళ్లావ్..? సాయం చేయాల్సిన అవసరమేం ఉందని బెదిరించారని అన్నారు. షర్మిల ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ వాళ్లను పెడుతున్నారన్నారు. జగన్‌ను ఇబ్బంది పెట్టకుండా పక్క రాష్ట్రానికి వెళ్లి రాజకీయం చేసుకుంటున్న షర్మిల మీద ఎందుకంత కోపమని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఇక్కడ పార్టీ పెడితే ఏమవుతుంది జగన్ పరిస్థితి అని ప్రశ్నించారు. ‘‘షర్మిల నా కూతురు లెక్కే కానీ.. జగన్ కొడుకు లెక్క కాదు’’ అని అన్నారు.

వైఎస్సార్‌ను పొగిడితే జగన్‌కు నచ్చదు...

వైఎస్సార్ ఏడు కొండలు మింగేస్తారని తిట్టిన దాడి వీరభద్రరావును పార్టీలోకి తెచ్చుకున్నారని.. వైఎస్సార్‌కు నమ్మకంగా పని చేసిన కొణతాలను జగన్ దూరంగా పెట్టారని మండిపడ్డారు. వైఎస్ కంటే జగనే గొప్ప అనేవారే ఆయనకు నచ్చుతారని తెలిపారు. తన తండ్రి వైఎస్సార్‌ను పొగిడితే జగన్‌కు నచ్చదన్నారు. విజయమ్మ కళ్ల నీళ్లు పెట్టుకునేలా మాట్లాడిన బొత్స ఇప్పుడు కిచెన్ క్యాబినెట్‌లో ఉన్నారని యెద్దేవా చేశారు. విజయమ్మను రాజ్యసభకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా..? లేదా..? అని అడిగితే.. నీలం సంజీవరెడ్డిని కులం అడిగినట్టుందని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో అవివాష్ రెడ్డి పాత్ర ఉందని స్పష్టం చేశారు. చాలా మంది పెద్ద వాళ్లు.. మాజీ కేంద్ర మంత్రులు.. మాజీ సీఎంలు.. మాజీ మంత్రులు జైళ్లకు వెళ్తారని.. వీళ్లకంటే అవినాష్ రెడ్డి గొప్పేం కాదన్నారు.

వైసీపీ ఓటమి ఖాయం...

టీడీపీ (TDP) - జనసేన (Janasena) కలిస్తే 151 సీట్లు దాటుతాయని.. విడిగా పోటీ చేసినా టీడీపీకి 100 సీట్లు దాటుతాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొందరు విశ్లేషకులు డబ్బులు తీసుకుని చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీలో ఉన్న మద్యం బ్రాండ్లు.. మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. సంక్షేమం ఎన్టీఆర్‌తోనే మొదలైందని.. కానీ ఎన్టీఆర్ స్వయంగా కల్వకుర్తిలో ఓడిపోయారన్నారు. ఎన్టీఆర్ కంటే జగన్ గొప్పొడా అని నిలదీశారు. సంక్షేమం నిధులు జగన్ తన జేబుల్లో నుంచి ఇస్తున్నారా అంటూ గోనె ప్రకాష్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-04-25T13:14:43+05:30 IST