Shocking Incident: వామ్మో.. ఇది మరో దారుణం.. ఈసారి ఏపీలో.. పల్నాడు జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన..!

ABN , First Publish Date - 2023-02-26T11:38:13+05:30 IST

మనుషుల్లో రోజురోజుకూ నేర ప్రవృత్తి పెరుగుతోందా..? చంపి ముక్కలుగా నరికి పైశాచిక ఆనందం పొందేంత వికృత మృగం నిద్రలేచిందా..? తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన రెండు ఘటనలు..

Shocking Incident: వామ్మో.. ఇది మరో దారుణం.. ఈసారి ఏపీలో.. పల్నాడు జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన..!

మనుషుల్లో రోజురోజుకూ నేర ప్రవృత్తి పెరుగుతోందా..? చంపి ముక్కలుగా నరికి పైశాచిక ఆనందం పొందేంత వికృత మృగం నిద్రలేచిందా..? తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన రెండు ఘటనలు ఈ ప్రశ్నలు లేవనెత్తడానికి కారణం అయ్యాయి. తాజాగా వెలుగుచూసిన రెండు ఘటనలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో ఒక అమ్మాయి కోసం స్నేహితుడినే ఒక యువకుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన వెలుగుచూసి రోజులు కూడా గడవక ముందే పల్నాడు జిల్లాలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి ముక్కలుముక్కలుగా నరికి పొలంలో దహనం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ రెండు ఘటనలూ తెలుగు రాష్ట్రాల ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.

దాచేపల్లి నగర పంచాయతీలో వాటర్‌ సర్వీస్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గరికపాటి కోటేశ్వరరావు(46)ను దారుణంగా హత్య చేసి ఆపై ముక్కలుముక్కలుగా నరికి పొలంలో దహనం చేసిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హతుడు కోటేశ్వర రావు పదేళ్లుగా వాటర్‌ సర్వీస్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం కోటేశ్వరరావు రెంటచింతల మండలం మంచికల్లులో నివాసం ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లాడు. అయితే తాను మంచికల్లులో ఉన్నట్లు ఉదయం పూట నీటిని విడుదల చేయాలని తనతో కలిసి పనిచేసే వ్యక్తులకు ఫోన్‌ చేసి తెలిపాడు. సాయంత్రం 7.30 గంటల సమయంలో ఊరు నుంచి తాను వచ్చానని సహోద్యుగులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత దాచేపల్లిలో జరుగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా భోజనానికి రావాలని నగర పంచాయతీ సిబ్బంది ఫోన్‌ చేయగా కోటేశ్వరరావు ఫోన్‌ స్విచ్చాఫ్‌ అని వచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత కూడా ఫోన్‌ పని చేయలేదు. కోటేశ్వరరావు ద్విచక్ర వాహనం మాదినపాడురోడ్డులోని తిరుపతమ్మగుడి వద్ద ఉన్నట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో ఆందోళనతో వారు కోటేశ్వరరావు కోసం పలుచోట్ల వెతుకులాట ప్రారంభించారు.

ఈ క్రమంలో మాదినపాడు రోడ్డులో మోడల్‌ స్కూల్‌ సమీపంలోని మిర్చి పొలంలో ఓ మనిషిని తగల బెడుతున్నట్లుగా తెలుసుకున్నారు. అతడి కోసం గాలిస్తున్న వారు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ కాలిపోగా మిగిలిన ఓ వ్యక్తి పాదాన్ని గుర్తించారు. అక్కడున్న ఆనవాళ్ల ఆధారంగా తగలబడిన మృత దేహం కోటేశ్వరరావుదిగా అనుమానిస్తూ కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కోటేశ్వరరావుతో కలిసి పనిచేసే మరో వాటర్‌ సర్వీస్‌ ఆపరేటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిందా? లేక ఆర్థిక వివాదమా? వృత్తిపరమైన వివాదమా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించింది.

న్యాయం చేయాలని ధర్నా

కోటేశ్వరరావును దారుణంగా హత్య చేసి, ఆనవాళ్లు లేకుండా మృతదేహం తగలబెట్టిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కుటుంసభ్యులు, రజక సంఘాల నాయకులు అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై శనివారం రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న సీఐ బిలాలుద్దీన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకో విరమించారు. కోటేశ్వరరావుకు భార్య మల్లేశ్వరి, వివాహమైన ఇద్దరు కుమార్తెలు, డిగ్రీ చదువుతున్న కుమారుడు ఉన్నారు.

Updated Date - 2023-02-26T11:38:17+05:30 IST