AP Politics: ప్రకాశం జిల్లాలో ఈ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా?
ABN , Publish Date - Dec 27 , 2023 | 03:30 PM
AP Politics: ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా పలు జిల్లాలలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను మారుస్తోంది. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే... ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఈసారి దాదాపు ఐదుగురిని తప్పించాలని నిర్ణయించింది.
ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా పలు జిల్లాలలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను మారుస్తోంది. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే... ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఈసారి దాదాపు ఐదుగురిని తప్పించాలని నిర్ణయించింది. కొండేపి, దర్శి అభ్యర్థులను మార్చడం దాదాపు ఖరారుకాగా, మార్కాపురం,ఎర్రగొండపాలెం, గిద్దలూరులపై నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు దాదాపు ఖాయమైంది. సిట్టింగ్‌లను పక్కనపెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 28న సీఎం వైఎస్ జగన్ దగ్గర జరిగే సమావేశంలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మార్కాపురం ప్రస్తుతం ఎమ్మెల్యేగా కేపీ నాగార్జున రెడ్డి ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయన గెలిచారు. ఎమ్మెల్యేగా కేపి నాగార్జున గెలిచినా గ్రాఫ్ బాగోలేదన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సర్వేలు కూడా పూర్తి చేసి అంతర్గతంగా పార్టీ నేతలకు సమాచారం ఇచ్చింది. ఈసారి గెలుపు కీలకం కావడంతో ఏమాత్రం ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వొద్దని భావిస్తోంది. మార్కాపురం టికెట్ ప్రముఖ బిల్డర్ బట్టగిరి వెంకట సుబ్బారెడ్డి పేరును పరిశీలిస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న బట్టగిరి ఈసారి అధికార పార్టీ నుంచి బరిలోకి దింపేందుకు ఆలోచిస్తోంది. ప్రకాశం జిల్లాతోపాటు గుంటూరులోనూ ఈయనకు మంచిపేరుంది. 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ క్రిడాయ్ జిల్లా ప్రెసిడెంట్‌గా చేశారు. సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఇడిపూర్ పంచాయతీ స్కూల్‌కు భూమిని దానం చేశారు. మార్కాపురం గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ స్తాపించి పేద విద్యార్థులను ఆదుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. వైసీపీతో మొదటి నుంచి బట్టగిరికి అనుబంధం ఉంది. జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర, వెలిగొండ ప్రాజెక్టు పాదయాత్రలో పాల్గొన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇటు ప్రకాశం, అటు గుంటూరు జిల్లాలో ఎన్నికలను సమన్వయం చేసిన అనుభం బట్టగిరికి ఉంది. ఈసారి పార్టీతో అనుబంధం, ఆర్థికంగా బలంగా ఉండటం, కొత్త రాజకీయ సమీకరణ అంశాల ఆధారంగా ఈసారి ఇక్కడ అభ్యర్థిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎర్రగొండపాలెంలో అధికార పార్టీ అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ చర్చలు జరుపుతోంది. ఎర్రగొండపాలెంలో మాజీ ఐపీఎస్ అధికారి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అయిన కూచిపూడి బాబూరావు అభ్యర్థిత్వంపై మంతనాలు చేస్తున్నారు. అడిషనల్ డీజీగా బాబురావు రిటైర్డ్ అయ్యారు. బాబురావు తల్లిదండ్రులు కూచిపూడి ప్రకాశం, కూచిపూడి అనంతమ్మ జిల్లాలో టీచర్లుగా పనిచేశారు. ఐపీఎస్‌గా పదవీ విరమణ చేశాక రాజకీయాల్లోకి వచ్చేందుకు కూచిపూడి బాబురావు ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ అభిమాని అయిన బాబురావు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను కలిసి టికెట్ అడిగారు. అప్పటి పరిస్థితుల వల్ల సీటు ఇవ్వలేనని చెప్పిన వైఎస్ జగన్ భవిష్యత్తులో చూద్దామని హామీ ఇచ్చారట. సీటు రానప్పటికీ అప్పటి నుంచి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బాబురావు. ఈసారి తనకు అన్ని అనుకూలంగా ఉన్నాయని బాబూరావు భావిస్తున్నారు. అడిషనల్ డీజీ స్థాయి పాలనా అనుభవం ఉండటం, ఎప్పటినుంచో పార్టీ సానుభూతి పరులుగా ఉండటం తనకు కలిసొచ్చిందని ఆయన అంచనా. దీనికి తోడు సామాజిక సమీకరణలు తనకు లాభిస్తుందని ఆయన భావిస్తున్నారు. తాను మాదిగ సామాజిక వర్గం కాగా తన భార్య బత్తుల విజయలక్ష్మీ మాల సామాజిక వర్గం. నియోజకవర్గ ఓటింగ్‌లో ఇది కూడా తనకు పాజిటివ్ అంశంగా ఆయన చెప్పుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఎర్రగొండపాలెం సమన్వయ కర్తను మారుస్తున్న సమయంలో తన పేరు పరిశీలిస్తున్నారని బాబూరావు నమ్ముతున్నారు. ఎర్రగొండపాలెం రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే సురేష్‌ను వైసీపీ అధిష్టానం కొండేపి నియోజకవర్గానికి మార్చింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.