Pawan Kalyan: గూండాలు, రౌడీలను ఎలా తన్నాలో నాకు తెలుసు

ABN , First Publish Date - 2023-01-12T19:09:01+05:30 IST

రణస్థలం (Ranasthalam)లో జనసేన యువశక్తి సభ నిర్వహించారు. యువత(youth)కు బంగారు భవిష్యత్‌ కోసం బాధ్యతగా పనిచేస్తామని జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) హామీ ఇచ్చారు.

Pawan Kalyan: గూండాలు, రౌడీలను ఎలా తన్నాలో నాకు తెలుసు

శ్రీకాకుళం (Srikakulam): ‘‘ ప్రతి వెధవతో, ప్రతి సన్నాసితో మాట అనిపించుకుంటున్నాను’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు అనిపించుకోకుండా బతికేయగలనని, అయితే ప్రజల పక్షాన నిలబడి తిట్టించుకోవడం గెలుపుగానే భావిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాల్లో ఉంటే ఈ వెధవలే వచ్చి మరీ ఫొటోలు దిగుతారని అన్నారు. పేదలు, సామాజిక బాధ్యతే తనకు ముఖ్యమన్నారు. ఈ రాజకీయ నాయకులు ఏమైనా దిగొచ్చారా? అని ప్రశ్నించారు. ‘‘ రాజకీయ నాయకులు ఒకటంటే.. మనమూ అనగలం. రాజకీయ నేతలకు ఎంత హక్కు ఉందో.. మనకూ అంతే ఉంది. ఇది కళింగాంధ్ర కాదు.. కలబడే ఆంధ్రా. రాజకీయ నాయకులకు ఏమైనా కొమ్ములు ఉంటాయా?, వాళ్లను నిలదీయాలంటే ఎందుకంత భయం?. వెధవలను, సన్నాసులను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. గూండాలు, రౌడీలను ఎలా తన్నాలో కూడా నాకు తెలుసు’’ అని పవన్‌ హెచ్చరించారు. ఓటమిని గాయంగా భావించానే తప్ప పరాజయంగా కాదని, తన చివరి శ్వాస వరకూ రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదని పవన్‌ స్పష్టం చేశారు. రణస్థలం (Ranasthalam)లో జనసేన యువశక్తి సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

యువత భవిత కోసమే...

యువత(youth)కు బంగారు భవిష్యత్‌ కోసం బాధ్యతగా పనిచేస్తామని జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) వాగ్దానం చేశారు. యువతకు మంచి భవిష్యత్‌ కోసమే తన పోరాటమన్నారు. ఒక దేశపు సంపద నదులు, ఖనిజాలు కాదని, ఒక దేశపు సంపద యువత కలల ఖనిజాలు అని పవన్‌ స్పష్టం చేశారు. తనకూ సగటు మనిషి ఆలోచనే ఉందని, చేతికి చేతికర్ర కావాల్సిన రోజు వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుందన్నారు. వయస్సు పెరుగుతూ వచ్చినప్పుడు భావితరం విలువ తెలుస్తుందని పవన్ తెలిపారు. ఎవరినో తిట్టడానికి ఈ సభ పెట్టలేదని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇతరుల కోసం జీవించడాన్నే తాను ఆనందంగా భావిస్తానని పవన్ అన్నారు.

Updated Date - 2023-01-12T19:28:12+05:30 IST