Srisailam: శ్రీశైలం బ్రహ్ర్మోత్సవాల మొదటి రోజే అపశృతి
ABN , First Publish Date - 2023-02-11T21:10:50+05:30 IST
శ్రీశైలం (Srisailam) అన్నదాన భవనంలో భక్తులకు ప్రసాదాలను సిద్ధం చేస్తుండగా శనివారం బాయిలర్ పేలింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ఎనిమిది మంది కార్మికులకు గాయాలయ్యాయి.
శ్రీశైలం: శ్రీశైలం (Srisailam) అన్నదాన భవనంలో భక్తులకు ప్రసాదాలను సిద్ధం చేస్తుండగా శనివారం బాయిలర్ పేలింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ఎనిమిది మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే దేవస్థానం వైద్యశాలకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉన్నత వైద్యం కోసం కర్నూలు (Kurnool) ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గత ఏడాది నవంబరు 1వ తేదీన కూడా బాయిలర్ పేలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. పర్యవేక్షణ లోపంతోనే ఇలా జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు (devotees) శ్రీశైలానికి వస్తారు. ఈ నేపథ్యంలో కొంతమంతి వ్యాపారులు దేవస్థానం పరిధిలో ఎక్కడపడితే అక్కడ తాత్కాలిక హోటళ్లను నిర్వహిస్తూ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తారు. వీరికి అవగాహన కల్పించడంతోపాటు భక్తుల భద్రతపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. 11 రోజులపాటు స్వామి అమ్మవార్లకు వివిధ సేవలు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం ధ్వజారోహణ, భేరి పూజ చేశారు. తర్వాతి రోజు నుంచి స్వామి అమ్మవార్లకు రోజుకో వాహన సేవ నిర్వహిస్తారు. మహా శివరాత్రి రోజున సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఇదే సమయంలో స్వామివారికి పాగాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లింగోద్భవ కార్యక్రమం అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు.