Viveka Murder Case : వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ..
ABN , First Publish Date - 2023-03-20T17:18:35+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) దర్యాప్తు ఆలస్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది...
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) దర్యాప్తు ఆలస్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణపై తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. అసలు ఇన్నిరోజులుగా వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని సీబీఐపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. దర్యాప్తు అధికారి ఎందుకు విచారణను జాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించించింది. విచారణ త్వరగా ముగించలేకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి సమర్ధవంతుడు కాకపోతే ఆయన స్థానంలో వేరొకరిని నియమించడంపై సీబీఐ డైరక్టర్ అభిప్రాయం అడిగి చెప్పాలని సీబీఐ తరపు న్యాయవాది నటరాజన్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
సుప్రీంలో పిటిషన్..!
కాగా.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను జాప్యం చేస్తున్నందున మార్చాలని పిటిషన్‌లో ఆమె కోరారు. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అనంతరం కేసు విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. గతంలో రాంసింగ్‌పై వివేకా హత్య కేసులో నిందితులు కేసు పెట్టారు. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.
వివేకా కేసులో కీలక పరిణామం..!
ఇదిలా ఉంటే.. తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్‌రెడ్డి(YS Bhaskar Reddy) పిటిషన్(Petition) వేశారు. వివేక హత్య కేసులో ఏ-4 దస్తగిరినీ(Dastagiri) అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి(Avinash Reddy), భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారించింది. కాగా.. దస్తగిరినీ అప్రూవర్‌గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ లో..‘దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదు. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడు. కీలక పాత్ర పోషించిన దస్తగిరి కి బెయిల్ ఇవ్వటం సరికాదు. వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినే.. బెయిల్ సమయంలోను సీబీఐ సహకరించింది. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలి’ అని పిటిషన్‌లో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.