Pattabhi: బెయిల్‌పై 10ఏళ్లు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌లో జగన్ పేరు.. పట్టాభి సెటైరికల్ పంచ్

ABN , First Publish Date - 2023-09-23T12:22:19+05:30 IST

సీఎం జగన్ రెడ్డి జీవితంలో ఈరోజు అత్యంత సంతోషకరమైన రోజు అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు బెయిల్‌పై దర్జాగా జీవిస్తూ, తన బెయిల్ కాలాన్ని 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి పట్టరాని ఆనందంతో పదవ బెయిల్ వార్షికోత్సవం జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Pattabhi: బెయిల్‌పై 10ఏళ్లు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌లో జగన్ పేరు.. పట్టాభి సెటైరికల్ పంచ్

అమరావతి: సీఎం జగన్ రెడ్డి (AP CM Jaganreddy) జీవితంలో ఈరోజు అత్యంత సంతోషకరమైన రోజు అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP Leader Kommareddy Pattabhiram) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు బెయిల్‌పై దర్జాగా జీవిస్తూ, తన బెయిల్ కాలాన్ని 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి పట్టరాని ఆనందంతో పదవ బెయిల్ వార్షికోత్సవం జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సరిగ్గా పదేళ్లక్రితం ఇదేరోజున (సెప్టెంబర్ 23, 2013న) జగన్ రెడ్డి తనపై ఉన్న 11 సీబీఐ కేసుల్లో బెయిల్ పొంది జైలు నుంచి జనాల్లోకి వచ్చారన్నారు. జగన్ రెడ్డి సాధించిన ఈ గొప్ప ఘనతను గుర్తించి, ‘ఎక్కువ కాలం బెయిల్‌పై జీవించిన వ్యక్తి’ గా జగన్ రెడ్డిని గుర్తించి, ఆయనకు ఒక రికార్డ్ ఇవ్వాలని కోరుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ పెట్టినట్లు సెటైర్ విసిరారు. వారు త్వరలోనే జగన్ రెడ్డిని కలిసి ఆయన సాధించిన ఘనతకు సంబంధించిన సర్టిఫికెట్ అందిస్తారన్నారు. ఆ సర్టిఫికెట్‌ను జగన్ రెడ్డి పెద్దపెద్ద ఫ్రేములు కట్టించి తన ప్యాలెస్‌లతో పాటు,ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని వ్యాఖ్యలు చేశారు. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకొని వైసీపీ శ్రేణులు ఆనందోత్సాహాలతో తాడేపల్లి ప్యాలెస్‌లో సంబరాలు చేసుకుంటున్నారన్నారు. మరోపక్క ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డి పట్టరాని సంతోషంతో తమ పార్టీ నేతలకు పాయసం పంచి పెడుతోందని ఆయన అన్నారు.


అలానే టీడీపీ శాసనసభాపక్షం ముఖ్యమంత్రి ప్రతిభను, గొప్పతనాన్ని తెలియచేస్తూ పదేళ్ల బెయిల్ కాలంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటోందంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ ఇచ్చే తీర్మానంపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చర్చలో పాల్గొని వారి అభిమాన నాయకుడు జగన్ రెడ్డిని మననస్ఫూర్తిగా అభినందించాలన్నారు. ఇంత గొప్ప ఆలోచన చేసిన టీడీపీ సభ్యులు యూజ్ లెస్ ఫెలోస్ కాదు.. యూజ్ ఫుల్ పర్సన్స్ అని స్పీకర్ ఇప్పటికైనా తమ పార్టీ ముందు చూపుని అభినందిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. అలానే జగన్ రెడ్డి తన పదేళ్ల బెయిల్ కాలంలోని అనుభవాలను వివరిస్తూ కోర్టులను తప్పించుకొని ఎక్కువకాలం బెయిల్ ఉండటం ఎలాగో వివరిస్తూ ఒక పుస్తకం రాస్తే అది నేరసామ్రాజ్యానికి దిక్సూచిగా ఉంటుందన్నారు. జగన్ రెడ్డి ఇలాంటి ఘనతలు సాధిస్తే ప్రజానాయకుడు అయిన చంద్రబాబు ఏమో ఇండియన్ ఆఫ్ ది మిలీనియం, సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ వంటి పురస్కారాలతో సరిపెట్టుకున్నారన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం డ్రీమ్ కేబినెట్లో చంద్రబాబుకు చోటు దక్కితే, వరల్డ్ ప్రిజనరీస్ ఫోరం గౌరవాధ్యక్షుడిగా జగన్ రెడ్డి గుర్తింపు పొందారన్నారు. ఎలాంటి స్థితిలో తానుండి ఏ మచ్చా లేని చంద్రబాబు నాయుడిని అన్యాయంగా జైలుకు పంపాడో ఈరోజైనా జగన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది అంటూ పట్టాభి హితవుపలికారు.

Updated Date - 2023-09-23T12:22:19+05:30 IST