Varla Ramaiah: ‘ఇదే డీజీపీకి ఆఖరి అవకాశం... చంద్రబాబు పర్యటనలో ఏదైనా జరిగితే.. ’
ABN , First Publish Date - 2023-04-25T15:29:07+05:30 IST
ఏపీ సీఎం జగన్, ఆయన ప్రభుత్వం శాంతిభద్రతల నిర్వహణలో ఘోరంగా విఫలమైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు.
అమరావతి: ఏపీ సీఎం జగన్, ఆయన ప్రభుత్వం శాంతిభద్రతల నిర్వహణలో ఘోరంగా విఫలమైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు పోలీసు అధికారులు అధికారపార్టీకి దాసోహమై వైసీపీ వారి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రజాస్వామ్యబద్ధంగా నడవకపోవడమే రాష్ట్రంలో శాంతిభద్రతల లేమికి ప్రధానకారణమన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తెలియని సజ్జల రాష్ట్రాన్ని, పోలీసుశాఖను శాసించడం బాధాకరమని అన్నారు. యర్రగొండపాలెం ఘటనలో మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకున్న మంత్రి, అతని అనుచరులపై టీడీపీ ఫిర్యాదు చేస్తే ఎఫ్.ఐ.ఆర్ నుంచి మంత్రి పేరు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఎఫ్.ఐ.ఆర్ నుంచి మంత్రి పేరు తీసేసిన అధికారి తీరుపై తాము కోర్టుని ఆశ్రయిస్తే, అతని గతేంటని అడిగారు. మంత్రిని కాపాడాలనుకుంటున్నపోలీసులు రేపు గవర్నర్‌కు ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు.
యర్రగొండపాలెంలో విఫలమైన పోలీస్, నేటి చంద్రబాబు పల్నాడు పర్యటనలో కూడా విఫలమైతే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డే బాధ్యుడవుతారని తెలిపారు. చంద్రబాబు పల్నాడు పర్యటనలో శాంతిభద్రతలకు సంబంధించి చిన్నఅపశృతి దొర్లినా డీజీపీపై హైకోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ వేస్తామని చెప్పారు. కోరతాం. ఇదే డీజీపీకి ఆఖరి అవకాశం. ఎలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబుగారి పల్నాడు పర్యటన సజావుగా, సక్రమంగా జరిపించాల్సిన బాధ్యత రాజేంద్రనాథ్ రెడ్డిదే అని స్పష్టం చేశారు. చంద్రబాబు పల్నాడు పర్యటనను నిరసిస్తూ అధికారపార్టీ ఎమ్మెల్యే అవినీతిసొమ్ముతో అడ్డగోలుగా బ్యానర్లు, ప్లెక్సీలు కడుతుంటే అక్కడి పోలీసులేం చేస్తున్నారంటూ వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.