Avinash Reddy: అవినాశ్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు విధించిన షరతులేంటంటే..
ABN , First Publish Date - 2023-05-31T12:44:49+05:30 IST
వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు కొన్ని షరతులను విధించింది. సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌కు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జూన్ చివరి వరకూ ప్రతి శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) అవినాశ్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు (Avinash Reddy) చేసిన తెలంగాణ హైకోర్టు కొన్ని షరతులను విధించింది. సీబీఐ విచారణకు (Avinash CBI Enquiry) సహకరించాలని అవినాశ్‌కు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జూన్ చివరి వరకూ ప్రతి శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని హైకోర్టు అవినాశ్ రెడ్డికి స్పష్టం చేసింది.
మొత్తం ఐదు షరతులతో తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు అవినాశ్ ముందస్తు బెయిల్‌పై తీర్పు వెలువరించిది. ఇదిలా ఉండగా.. కీలక సాక్షి వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ సమర్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే సీబీఐ సంచలన విషయాన్ని కోర్టు ముందు వెల్లడించింది.
తెలంగాణ హైకోర్టులో వాదనల సందర్భంగా.. తమ వద్ద ‘ రహస్య సాక్షి ’ వాంగ్మూలం ఉందని సీబీఐ మరో బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఈ రహస్య సాక్షి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో వివేకా హత్య వెనుక విస్తృత రాజకీయ కుట్ర ఉందని బట్టబయలైందని సీబీఐ పేర్కొంది. హత్య వెనుక రాజకీయ కారణాలు తప్ప మరే ఇతర కోణాలు లేవనే వాదనకు ఈ స్టేట్‌మెంట్‌తో తిరుగులేని బలం చేకూరిందని సీబీఐ స్పష్టం చేసింది.
భద్రత దృష్ట్యా ఈ సాక్షి పేరు ఇప్పుడు వెల్లడించలేమని.. త్వరలో సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ఈ వాంగ్మూలాన్ని వెల్లడిస్తామని సీబీఐ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. అంతగా కావాలంటే సీల్డ్ కవర్‌లో స్టేట్‌మెంట్ సమర్పిస్తామని, అయితే ఈ విషయం అత్యంత రహస్యం అయినందున పిటిషనర్ (అవినాశ్‌రెడ్డి) న్యాయవాదులకు ఎట్టి పరిస్థితుల్లో తెలియరాదని పేర్కొన్నారు. గతంలోనూ సాక్షుల పేర్లు వెల్లడించిన తర్వాత వారు మారిపోవడమో.. చనిపోవడమో జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ చెప్పినట్టే.. హైకోర్టుకు కీలక సాక్షి వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్‌లో సమర్పించింది.