Srisailam: మల్లన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌

ABN , First Publish Date - 2023-02-26T19:49:16+05:30 IST

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదివారం ఉదయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (DY Chandrachud) దంపతులు

Srisailam: మల్లన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌

శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదివారం ఉదయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (DY Chandrachud) దంపతులు, సుప్రీంకోర్టు (Supreme Court) జడ్జి పీఎస్‌ నరసింహ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న, అర్చకులు, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తరువాత చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ దంపతులు, సుప్రీంకోర్టు జడ్జి పీఎస్‌ నరసింహ దంపతులు రత్నగర్భ గణపతి స్వామిని దర్శించుకొని హారతులు అందుకున్నారు.

అనంతరం వీరు స్వామివారిని దర్శించుకొని రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం మల్లికాగుండంలోని సరస్వతీ నదీ అంతర్వాహినిలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. తరువాత భ్రమరాంబికా అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన నిర్వహించుకున్నారు. స్వామిఅమ్మవార్ల దర్శనానంతరం వీరికి అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.లవన్న వీరికి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, స్వామిఅమ్మవార్ల జ్ఙాపికను అందజేశారు.

Updated Date - 2023-02-26T19:49:17+05:30 IST