మాజీ మంత్రి నారాయణ కేసులో కీలక ఆదేశాలిచ్చిన హైకోర్టు
ABN , First Publish Date - 2023-03-03T18:48:07+05:30 IST
మాజీ మంత్రి నారాయణ (Former minister Narayana)పై నమోదయిన అమరావతి ప్రాంత మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ కేసు విచారణలో..
అమరావతి: మాజీ మంత్రి నారాయణ (Former minister Narayana)పై నమోదయిన అమరావతి ప్రాంత మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ కేసు విచారణలో హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. నారాయణను, ఆయన భార్య రమాదేవితో పాటు నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీలను ఇంటి దగ్గరే విచారించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు (Inner ring road alignment case)లో అవకతవకలకు పాల్పడ్డారని నారాయణ, మరికొందరిపై సీఐడీ (CID) కేసులు చేసింది. అయితే ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఈనెల 6న నారాయణ దంపతులు సహా కంపెనీ ఉద్యోగి ప్రమీలకు సీఐడీ నోటీసులిచ్చింది. నారాయణ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మహిళలను ఇంటి దగ్గరే విచారించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పులున్నాయని దమ్మాలపాటి కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే నారాయణను ఇంటి దగ్గరే విచారించాలని గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. వాదనలు పరిగణలోకి తీసుకొని పిటిషనర్లను ఇంటి దగ్గరే విచారించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
నారాయణ దంపతులకు సీఐడీ నోటీసు
అమరావతి ప్రాంత మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ కేసులో నారాయణ దంపతులను సీఐడీ విచారణకు పిలిచింది. వారిద్దరితో పాటు నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు జారీ చేసింది. వచ్చే సోమవారం (మార్చి 6న) గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాలని కోరింది. ఇదే వ్యవహారంలో సాక్షులుగా రావాలని నారాయణ కుమార్తెలు సింధూర, షరిణిలకు సీఆర్‌పీసీ 160 కింద నోటీసు జారీ చేసింది. వారితో పాటు అల్లుడు పునీత్, నారాయణ సంస్థల ఉద్యోగి వరుణ్ కుమార్‌ను మార్చి 7, 8 తేదీల్లో దర్యాప్తు సంస్థ అధికారులు గుంటూరులో ప్రశ్నించనున్నారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నారాయణను ఇప్పటికే పలు మార్లు విచారించింది.