Temperature: రానున్న ఐదు రోజులు ఎండలే ఎండలు
ABN , First Publish Date - 2023-04-08T21:15:53+05:30 IST
వేసని ఆరంభంలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ప్రకటించాయి.
విశాఖ: వేసని ఆరంభంలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ప్రకటించాయి. మార్చి, ఏప్రిల్ (March, April), మే నెలల్లో దేశంలో ఎండలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు పెరుగుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా పార్వతీపురం, శ్రీకాకుళం (Srikakulam), అనకాపల్లి, రంపచోడవరం, రాజమండ్రి, విజయనగరం ప్రాంతాల్లో రానున్న 5 రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖలో 34 నుండి 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏపీలోని మిగిలిన ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రత 36 నుండి 42 డిగ్రీల వరకు ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
మధ్య భారతం నుంచి దక్షిణ భారతం వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. పశ్చిమ దిశగా వస్తున్న పొడిగాలులతో వాతావరణం వేడెక్కింది. శుక్రవారం కడప (Kadapa)లో 40, అనంతపురం (Anantapur)లో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో ఎండ ధాటికి మధ్యాహ్నం ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొందరు ఎండవేడి నుంచి రక్షణ కోసం గొడుగులు, టవల్స్ అడ్డుపెట్టుకోగా మహిళలు చున్నీలను కప్పుకుని తిరుగుతుండడం కనిపించింది. వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక మండే ఎండలు రోజువారీ కూలీలపై ప్రభావం చూపుతోంది.
జాగ్రత్తలు తప్పని సరి
వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు కూడా ఏర్పడుతుంది. అలాగే ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కనుక వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో చమట ఎక్కువ పడుతుంది కనుక సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్‌కు బదులు మజ్జిగ, పండ్ల రసాలు తాగడం ఉత్తమం. ఎండ నుంచి ఇంటికి వచ్చిన వారు నిమ్మరసం తాగాలి. వేసవి ఉపశమనం కోసం కర్బూజ, దోసకాయలు, ఇతర పండ్లను తీసుకోవాలి.
సాధ్యమైనంత వరకు నల్లటి దుస్తులు ధరించకుండా బాగా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉండడం మంచిది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం 11 గంటలలోపు పని ముగించుకుని ఇంటికి చేరాలి. బయటకు వెళ్లే వారు ఎండ నుంచి రక్షణ కోసం కూలింగ్ గ్లాసెస్, టోపి, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి. బయటకు వెళ్లే ముందు సన్ స్ర్కీన్ లోషన్ రాసుకోవాలి. మసాలాతో కూడిన ఆహారానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.