TTD: తిరుమలలో 22న ఉగాది ఆస్థానం
ABN , First Publish Date - 2023-03-19T20:53:50+05:30 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి (Tirumala Srivenkateswara Swamy) ఆలయంలో ఈనెల 22వ తేదీన శ్రీశోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది.
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి (Tirumala Srivenkateswara Swamy) ఆలయంలో ఈనెల 22వ తేదీన శ్రీశోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా తెల్లవారు జామున మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించాక శుద్ధి చేస్తారు. ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఏడు నుంచి తొమ్మిది గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. తర్వాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం ఉంటుంది. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాదిని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆస్థానం సందర్భంగా సోమవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో ఈనెల 21, 22 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనానికి ఎలాంటి సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు.
శ్రీవారి సేవలో ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్
ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు.