Varla Ramaiah: టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులపై కేంద్ర హోం సెక్రటరీకి వర్ల రామయ్య లేఖ
ABN , First Publish Date - 2023-08-09T17:20:14+05:30 IST
టీడీపీ నేతలు, కార్యకర్తలపై (TDP leaders and workers) అక్రమ పోలీసు కేసులపై కేంద్ర హోం సెక్రటరీకి (Union Home Secretary) టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు.
అమరావతి: టీడీపీ నేతలు, కార్యకర్తలపై (TDP leaders and workers) అక్రమ పోలీసు కేసులపై కేంద్ర హోం సెక్రటరీకి (Union Home Secretary) టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు.
"రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. చిత్తూరు జిల్లా అంగళ్లులో టీడీపీ కార్యకర్తలపై 400 మంది వైసీపీ గూండాలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎన్.ఎస్.జీ రక్షణ వలయంలోని ప్రతిపక్షనేత చంద్రబాబుపై దాడి జరుగుతుంటే పోలీసులు విగ్రహాల్లా చూస్తూ ఉండిపోయారు. దాడికి గురైన వారిపై ఒకే ఎఫ్.ఐ.ఆర్‌తో ఐపీసీ 307 కేసులు నమోదు చేసి 20 మంది టీడీపీ నాయకులను రిమాండ్‌కు పంపారు. మరో ఎఫ్.ఐ.ఆర్‌తో ఒక సినిమా కథ సృష్టించి వైసీపీ వారిని చంపేందుకు కుట్రపన్నారంటూ టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. తెలుగు, ఇంగ్లీషురాని 6వ తరగతి చదివిన డ్రైవర్‌తో తప్పుడు అంగీకారపత్రం తీసుకుని అదుపులోకి తీసుకున్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాధ్ రెడ్డి ఒత్తిడితో పోలీసులు వరుసపెట్టి ఎఫ్.ఐ.ఆర్ లు నమోదుచేస్తూ టీడీపీ నాయకులను, కార్యకర్తలను అదుపులోని తీసుకుంటున్నారు. భీమగానిపల్లె క్రాస్ రోడ్‌లో సైతం చంద్రబాబునాయుడి యాత్రను అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న టీడీపీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణ రహితంగా భాష్పవాయువు తూటాలు ప్రయోగించి లాఠీఛార్జ్ చేశారు. గుర్తుతెలియని వైసీపీ గూండాలు టీడీపీ కార్యకర్తలపై రాళ్లదాడి చేశారు. దాదాపు 40 టీడీపీ కార్యకర్తలు గాయాలపాలయ్యారు. దీనిపై ముందుగానే ప్లాన్ ప్రకారం వ్యవహరించిన చిత్తూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వారు పోలీసులపై దాడికి పాల్పడ్డారంటూ బాధితులపై ఆరోపణలు చేశారు. దాడికి సంబంధించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ సమాధానం చెప్పలేక విలేఖరులపై చిర్రుబుర్రులాడారు. చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడిని ఏ1గా కేసు నమోదు చేస్తామని ముందే చెప్పారు. అనంతపూర్ డి.ఐ.జీ సైతం ఈ ఘటనను పోలీసులపై దాడిగా వర్ణించారు. నర్సీపట్నంలో పనిచేస్తున్న సమయంలో ఇదే ఎస్పీపై కస్టోడియల్ టార్చర్ కేసు ఉంది. హైకోర్టు సైతం ఎస్పీపై విచారణకు ఆదేశించింది." అని వర్ల రామయ్య లేఖలో ప్రస్తావించారు.
"చిత్తూరులో ఇప్పటికే దాదాపు 250 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. అరెస్టులకు సంబంధించి పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించడం లేదు. ఒక ఘటనపై అనేక ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయకూడదనే నిబంధనను పాటించడం లేదు. హత్యాయత్నంకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. బలవంతపు అంగీకార పత్రాలు తీసుకుని నేరం ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అరెస్టు చేసిన వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం లేదు. రాష్ట్రంలో పాతకాలపు పాలెగాళ్ల పాలన సాగుతోంది. చంద్రబాబు యాత్ర మార్గంలోకి వైసీపీ గూండాలను అనుమతించి వారికి నిరసన తెలిపే హక్కు ఉందంటూ ఎస్పీ మాట్లాడుతున్నారు. అధికార వైసీపీ నాయకుల కళ్లలో ఆనందం చూసేందుకు కొంతమంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. అనంతపూరం డీఐజీ, చిత్తూరు, అన్నమయ్య ఎస్పీలు వైసీపీ నాయకుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. నిష్పాక్షిక విచారణ చేస్తే ఎన్.ఎస్.జీ కమెండో గాయపడిన అంగళ్లులో ద్వారకానాధ్ రెడ్డి ప్రక్కనే ఉన్న రైస్ మిల్లులో కూర్చుని సీసీ టీవీ ఫూటేజీని మానిటర్ చేస్తున్న విషయం బయటపడుతుంది. భీమగానిపల్లెలో సైతం ఇటువంటి కుట్రకే ప్రణాళిక సిద్దం చేసి అమలుచేశారు. ఘటన 4వ తేదీ జరిగితే ఎఫ్.ఐ.ఆర్ 8వ తేదీన పెట్టారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోంది. ఘటనపై జుడీషియల్ విచారణ చేయించండి. అనంతపూరం డీఐజీ, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలపై విచారణ చేయించండి. అనంతపూరం డీఐజీ పరిధికి ఆవల ఉండే ఆఫీసర్ ను విచారణ అధికారిగా నియమించండి." అని లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు.