Visakha Steel Plant : స్టీల్ ప్లాంటుకు ‘అదానీ’ తిప్పలు
ABN , First Publish Date - 2023-07-27T02:07:59+05:30 IST
విశాఖ స్టీల్‌ప్లాంటును హస్తగతం చేసుకోవడానికి అదానీ కంపెనీ ఒక అడుగు ముందుకువేసింది. పోర్టులో హ్యాండ్లింగ్ చార్జీల బకాయి ఎక్కువగా ఉందనే సాకుతో మంగళవారం నుంచి బొగ్గు సరఫరా నిలిపివేసింది. దీంతో స్టీల్‌ప్లాంటులో
అట్లుంటది అదానీతో!
రూ.51 కోట్ల బకాయి ఉన్నారంటూ వెయ్యి కోట్ల సరుకు ఆపిన అదానీ పోర్టు
ప్లాంటుకు బొగ్గు పంపకుండా నిలిపివేత.. బకాయి సాకే.. ప్లాంటు హస్తగతమే టార్గెట్
పోర్టుకు ప్రధాన వ్యాపారం స్టీల్ ప్లాంటుదే.. వాడే రోడ్లు, నీటివనరులూ ఇక్కడివే
అయినా ప్లాంట్‌ను ఇబ్బందిపెడుతున్న పోర్టు.. ఉద్దేశపూర్వకంగానే: సంఘాలు
పోర్టు వాహనాలు ఆపేస్తామని హెచ్చరిక.. జగన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ స్టీల్‌ప్లాంటును హస్తగతం చేసుకోవడానికి అదానీ కంపెనీ ఒక అడుగు ముందుకువేసింది. పోర్టులో హ్యాండ్లింగ్ చార్జీల బకాయి ఎక్కువగా ఉందనే సాకుతో మంగళవారం నుంచి బొగ్గు సరఫరా నిలిపివేసింది. దీంతో స్టీల్‌ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. కొంతకాలంగా స్టీల్‌ప్లాంటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సాయం చేయాలని కోరినా కేంద్రం కనికరించలేదు. దీంతో బార్టరింగ్ విధానంలో ముడి పదార్థాలు ఇచ్చినవారికి తయారైన స్టీల్ ఇస్తామంటూ యాజమాన్యం ప్రకటన ఇచ్చి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అంతవరకు ప్లాంటును నడపడానికి నానాపాట్లు పడుతోంది. తక్షణమే నగదు వస్తుందనే ఆశతో స్టీల్ తయారీకి ఉపయోగించాల్సిన బిల్లెట్లను తక్కువ ధరకే విక్రయిస్తోంది. ఇలా వివిధ మార్గాల్లో సేకరించిన నిధులతో అవసరమైన ముడిపదార్థాలు సమకూర్చుకుంటోంది. స్టీల్ తయారీకి ప్రధానంగా కోకింగ్ కోల్ అవసరం. దీనిని యాజమాన్యం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇటీవల వేయి కోట్ల రూపాయలు వెచ్చించి ఆస్ట్రేలియా నుంచి 2.68 లక్షల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంది. ఇది అదానీ (గంగవరం) పోర్టుకు వస్తుంది. అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్‌ల ద్వారా స్టీల్ ప్లాంటుకు వస్తుంది. నౌక నుంచి దించిన బొగ్గును ప్లాంటుకు సరఫరా చేయడానికి పోర్టు హ్యాండ్లింగ్ చార్జీలు వసూలు చేస్తుంది. ఇలా చెల్లించాల్సిన బకాయిలు రూ.51 కోట్లకు చేరాయని, వెంటనే ఆ మొత్తం చెల్లిస్తే తప్ప బొగ్గును సరఫరా చేయలేమని అదానీ పోర్టు ప్రతినిధులు మంగళవారం జరిగిన సమావేశంలో స్పష్టంచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ నెల 25 వరకు హ్యాండ్లింగ్ చార్జీల కింద పోర్టుకు రూ.56.85 కోట్లను స్టీల్‌ప్లాంటు చెల్లించింది. గతంలో స్టీల్‌ప్లాంటు బకాయిలు పెట్టినా సరకులు ఎప్పుడూ ఆపలేదు. కానీ ఇప్పుడు కేవలం రూ.51 కోట్ల బకాయి కోసం వేయి కోట్ల రూపాయల బొగ్గును ఆపేసింది. ఇది న్యాయం కాదని, స్టీల్ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఆగిన ఉత్పత్తి.. ముడిపదార్థాల కొరతతో విశాఖ స్టీల్‌ప్లాంటులో ఇప్పటికే ఒక బ్లాస్ట్ ఫర్నేసు మూతపడింది. మిగిలిన రెండింటికి రోజుకు 11 వేల టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ప్లాంటులో 25 వేల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. అది రెండు రోజులకే సరిపోతుంది. ఆ తరువాత బొగ్గు సరఫరా చేయకపోతే ఉత్పత్తి ఆగిపోతుంది. అదే జరిగితే తిరిగి ఉత్పత్తి ప్రారంభించడానికి చాలా వ్యయం అవుతుంది. పోర్టు యార్డులో 2.68 లక్షల టన్ను బొగ్గు నిల్వలు ఉంటే 23న 1,300 టన్నులు, 24వ తేదీన 2,500 టన్నుల బొగ్గును పంపించారు. బకాయిపడిన మొత్తం చెల్లించాలని ఒక వైపు చెబుతూనే, మరోవైపు పోర్టులో బొగ్గు సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్‌లు పాడైపోయాయని, అందుకే సరఫరా చేయలేకపోతున్నామని పోర్టు వర్గాలు సాంకేతిక కారణాలు చూపిస్తున్నాయి. అదానీ పోర్టు ఏర్పాటుకు అవసరమైన 1100 ఎకరాల భూములను స్టీల్ ప్లాంటు ఇచ్చింది. అంతకుముందు విశాఖపట్నం పోర్టుతో ఉన్న ఒప్పందాలన్నీ రద్దుచేసుకొని ఈ పోర్టుకే వ్యాపారం ఇచ్చింది. పోర్టు చేసే వ్యాపారంలో స్టీల్‌ప్లాంటు మెటీరియలే 80 శాతం ఉంది. స్టీల్‌ప్లాంటు ఒప్పందం రద్దు చేసుకుంటే అదానీ పోర్టు తిప్పలు పడాల్సిందే. ఇది కాకుండా పోర్టుకు అవసరమైన నీటిని స్టీల్‌ప్లాంటుకు చెందిన కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నుంచి వాడుకుంటున్నారు. పోర్టు నుంచి లారీలు, కంటెయినర్లతో సరకులను తరలించడానికి స్టీల్‌ప్లాంటుకు చెందిన రహదారులనే ఉపయోగించుకుంటున్నారు. ప్లాంటుకు చెందినవన్నీ ఉపయోగించుకుంటూ, కేవలం రూ.51 కోట్ల బకాయి కోసం ఉత్పత్తికి ఆటంకం కలిగించే నిర్ణయం తీసుకోవడంపై స్టీల్ ప్లాంట్ వర్గాలన్నీ ఆగ్రహిస్తున్నాయి.