High Court: రుషికొండలో నిర్మాణాలపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2023-07-19T16:36:32+05:30 IST

అమరావతి: విశాఖలోని రుషికొండ నిర్మాణాలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిర్మాణాలు నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని అనుబంధ పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు ఆపాలని పిటిషన్ వేశారు.

High Court: రుషికొండలో నిర్మాణాలపై హైకోర్టులో విచారణ

అమరావతి: విశాఖలోని రుషికొండ (Rushikonda) నిర్మాణాలపై బుధవారం హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. నిర్మాణాలు నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని అనుబంధ పిటిషన్ (Petition) దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు ఆపాలని పిటిషన్ వేశారు. ఇప్పటికే నిర్మాణాలపై కేంద్ర అటవీ పర్యావరణ కమిటీ విచారణ నివేదిక ఇచ్చింది. కమిటీకి నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. అనుబంధ పిటిషన్‍పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీుకువెళ్లారు. దీంతో కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం తరపు న్యాయవాది వారం రోజులు సమయం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు గడువు ఇస్తూ.. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

కాగా విశాఖపట్నంలోని రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై అధికారుల నిఘా కొరవడింది. నిత్యం ఇక్కడి నిబంధనల ఉల్లంఘనపై పత్రికలు కథనాలు రాస్తున్నా, హైకోర్టులో న్యాయమూర్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా స్థానిక యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్‌) నియమాలకు తూట్లు పడుతున్నా పట్టనట్టు ప్రవరిస్తోంది. రుషికొండ సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉంది. ఇక్కడ కేవలం పర్యాటకుల కోసం మాత్రమే నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. హోటళ్లు, రిసార్టులు నిర్మించి, వాటిని పర్యాటకులకు మాత్రమే ఇవ్వాలి. అందుకోసం మాత్రమే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు ఇచ్చింది. ఆ భవనాలను కార్యాలయాల కోసం, అధికారుల గెస్ట్‌హౌస్‌ల కోసం వినియోగించకూడదు. అలా చేస్తే అది నిబంధనలకు వ్యతిరేకం. వెంటనే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవచ్చు.

రుషికొండపై హరిత రిసార్ట్స్‌ ఉండేవి. వాటిని కూలగొట్టి భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. అవి కూడా పర్యాటకుల కోసమేనని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాటిని చూస్తే అలా లేవు. పర్యాటకులకు అవసరమైన వసతులూ లేవు. దాంతో అనుమానం వచ్చిన కొందరు ప్రభుత్వానికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆ భవనాల నిర్మాణం భారీ కార్యాలయాల కోసం చేస్తున్నట్టుగా ఉందని, పర్యాటకులకు కాకుండా వేరే అవసరాలకు వినియోగిస్తే...దానిపై న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అయినా అధికారులు పట్టనట్టుగానే ఉంటున్నారు.

Updated Date - 2023-07-19T16:36:32+05:30 IST