Visakha: సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో అపచారం..
ABN , First Publish Date - 2023-04-25T14:56:12+05:30 IST
విశాఖ: సింహాచలం అప్పన్న స్వామి ఆలయం (Appanna Swamy Temple)లో అపచారం జరిగింది. స్వామి నిజరూపదర్శనాన్ని ఎవరో వీడియో తీసి షేర్ చేశారు.
విశాఖ: సింహాచలం అప్పన్న స్వామి ఆలయం (Appanna Swamy Temple)లో అపచారం జరిగింది. స్వామి నిజరూపదర్శనాన్ని ఎవరో వీడియో తీసి షేర్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో చక్కెర్లుకొడుతోంది. పవిత్రమైన అప్పన్న నిజరూపదర్శనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంపై భక్తులు మండిపడుతున్నారు. స్వామివారి నిజరూప దర్శనానికి ప్రజలు ఏడాదిపొడవున ఎంతగానో ఎదురుచూస్తారు. అక్షయ తృతీయనాడు ఒక్క రోజు మాత్రమే లభించే స్వామి నిజరూప దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అంతటి పవిత్రమైన స్వామివారి నిజరూప దర్శనం బయటకు రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతరాలయ దర్శనం వల్లనే ఈ ఘటన జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది కూడా సింహాచలంలో అపచారం జరిగింది. గర్భాలయాన్ని వీడియో తీసిన ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్వామి ఆంతరాలయాన్ని వీడియోలు తీయడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు వీడియో తీసిన వ్యక్తులను అధికారులు ఇప్పటి వరకు గుర్తించలేదు. అది మర్చిపోకముందే ఇప్పుడు ఏకంగా స్వామివారి నిజరూపాన్ని వీడియో తీశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలోని భద్రతాలోపాలపై మండిపడుతున్నారు.
కాగా చందనోత్సవ కార్యక్రమం నిర్వహించినప్పటి నుంచి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చందనోత్సవ కార్యక్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఇప్పుడు తాజాగా మరో అపచారం చోటు చేసుకుంది. కొంతమంది చందనోత్సవం రోజున స్వామి నిజరూపదర్శనాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంపై.. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.