AP Politics: పవన్ కళ్యాణ్‌తో పంచకర్ల భేటీ.. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటన
ABN , First Publish Date - 2023-07-16T15:01:57+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పంచకర్ల రమేష్‌బాబు సమావేశం అయ్యారు. ఈనెల 20న జనసేన పార్టీలో చేరుతున్నట్లు పంచకర్ల రమేష్‌బాబు వెల్లడించారు. తాను ఓ సామాన్య కార్యకర్త తరహాలో జనసేన పార్టీలో పనిచేస్తానని ఆయన తెలిపారు. తనకు పవన్ కళ్యాణ్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
విశాఖ వైసీపీ(YSRCP)లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. విశాఖ రాజధానిగా పాలన అందిస్తామని వైసీపీ చెప్తున్నా ఆ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదు. ప్రజలతో పాటు ఆ పార్టీ నేతలు కూడా జగన్ మాటను వినే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు (Panchakarla Ramesh babu) ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు పంచకర్ల రమేష్‌బాబు జనసేన(Janasena)లోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పంచకర్ల రమేష్‌బాబు సమావేశం అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తాను ఈనెల 20న జనసేన పార్టీలో చేరుతున్నట్లు పంచకర్ల రమేష్‌బాబు వెల్లడించారు. తాను ఓ సామాన్య కార్యకర్త తరహాలో జనసేన పార్టీలో పనిచేస్తానని ఆయన తెలిపారు. తనకు పవన్ కళ్యాణ్ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. తన అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి సంపాదించానని వైసీపీ నేతలు నిరూపిస్తే గొంతు కోసుకుంటానన్నారు.
అటు తన ఆత్మాభిమానం దెబ్బతినడంతో వైసీపీని వీడినట్లు పంచకర్ల రమేష్‌బాబు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కూడా సీఎం జగన్‌ను కలిసే పరిస్థితి వైసీపీలో లేదని ఆయన ఆరోపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా వేరొక అభ్యర్థి పేరును వచ్చే ఎన్నికలకు జగన్ ప్రకటిస్తారని తాను అనుకోనని పంచకర్ల అన్నారు. వైవీ సుబ్బారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పంచకర్ల రమేష్‌బాబు అన్నారు.
ఇది కూడా చదవండి: Konaseema Dist.: మంత్రి వేణుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తల విస్తృత సమావేశం
కాగా విశాఖ జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పంచకర్ల రమేష్ బాబు పోర్టు ఆధారిత వ్యాపారం చేస్తూ 2009 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం తరపున పెందుర్తి నుంచి పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. పీఆర్పీ విలీనం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగి 2014 ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంప్ అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ బాబుపై సిట్టింగ్ ఎమ్మెల్యే రమణమూర్తి రాజు విజయం సాధించారు. తనతో పాటు జిల్లాలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నట్టు టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్ష పదవికి రమేష్‌బాబు రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరగా.. ఆయనకు జగన్ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పంచకర్ల రమేష్‌బాబుకు వైసీపీ నుంచి టిక్కెట్ రాదని ప్రచారం జరుగుతుండటంతో ఆయన ఊహించని విధంగా పార్టీకి రాజీనామా చేయడం వైసీపీ వర్గాలకు ఆశ్చర్యం కలిగించింది.