Pawan Kalyan: జగన్ క్షమాపణలు చెప్పాలి.. లేకుంటే..

ABN , First Publish Date - 2023-02-16T21:09:54+05:30 IST

ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

Pawan Kalyan: జగన్ క్షమాపణలు చెప్పాలి.. లేకుంటే..

అమరావతి: వైసీపీ (YCP) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై జనసేన (JANASENA) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విమర్శలు గుప్పించారు. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వమని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఆస్పత్రులను మెరుగుపరచని వైసీపీ పెద్దలు, విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసేస్తారట అని పవన్ విమర్శించారు. బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్ల దూరం మోటార్ సైకిల్‌పై వెళ్లిన ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్‌లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయమని పవన్ అన్నారు.

ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఈ తరహా ఘటన మన రాష్ట్రంలో మొదటిది కాదని, కొద్ది నెలల కిందటే తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రిపడ్డ ఆవేదనను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదన్నారు. మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారని, ఆసుపత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైంది? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

మహాప్రస్థానం వాహనాలే కాదు, అంబులెన్సుల నిర్వహణ కూడా సక్రమంగా ఉండటం లేదని, బెంజి సర్కిల్లో అంబులెన్సులు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే ప్రయోజనం ఉండదని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు రూ.14 వేల కోట్ల బడ్జెట్ ఇచ్చామని చెబితే సరిపోదని, ప్రజలకు సేవలు అందాలన్నారు. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకే విశాఖలో రాజధాని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

చేతిలో డబ్బు లేక బిడ్డ మృతదేహాన్ని 120 కి.మీ మేర...

కాగా విశాఖ జిల్లాలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. బిడ్డ మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్లే స్తోమత లేక స్కూటీపై 120 కిలోమీటర్లు తీసుకెళ్లారు. కేజీహెచ్‌ (KGH) లో చనిపోయిన బిడ్డను (dead body) తీసుకెళ్తేందుకు ఆర్థిక స్తోమత లేక ఆ తల్లిదండ్రులు.. అంబులెన్స్ (Ambulance) ఏర్పాటు చేయాలని ప్రాధేయపడ్డారు. కానీ ఎంత బతిమాలినా ఆస్పత్రి సిబ్బంది కనికరపడలేదు. ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో గత్యంతరం లేక మృతదేహాన్ని స్కూటీ (scooty పై పెట్టుకుని పాడేరు (Paderu) వరకు 120 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అక్కడ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ఆస్పత్రి సిబ్బంది.. పాడేరు నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి

***************************************************************
దయ చూపించండి!

*****************************************

కవితకు మరింతగా బిగుస్తున్న ఉచ్చు..!

***************************************************

Updated Date - 2023-02-16T21:27:29+05:30 IST