Chalasani: ‘విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేయాలని కేంద్రం ఆలోచన’
ABN , First Publish Date - 2023-04-13T14:51:44+05:30 IST
విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేయాలని కేంద్రం ఆలోచన అని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేయాలని కేంద్రం ఆలోచన అని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ (Chalasani) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించిన పరిశ్రమ ఇది అని.. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. విజయ్ సాయి రెడ్డి ఏమైయ్యారు? స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మెడలు వంచుతామన్న జగన్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని అడిగారు. రాష్ట్రం ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించాలన్నారు. 35 ఎంపీలు ఉన్నా.. పార్లమెంట్‌లో ప్రస్తావించడం లేదని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుగా మాట్లాడడం అంటే.. ఏపీకి అన్యాయం చేసినట్టే అని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్‌లో అన్యాయం జరుగుతున్నా ఎవరూ గొంతు ఎత్తడం లేదన్నారు. విషవలయం నుండి పవన్ కళ్యాణ్ బయటకు రావాలని... అన్ని పార్టీ మీకు మద్దతు ఇస్తాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేస్తున్నా.. జగన్ అసలు పట్టించుకోవడం లేదన్నారు. కృష్ణా గోదావరి గ్యాస్‌ను మీరు తరలిస్తున్నారన్నారు. ఈ ప్రాంతాన్ని న్యాయం చేయకుండా ఇక్కడ వనరులు ఎలా తీసుకొని వెళ్తారని.. ఇక్కడ రాజకీయ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని చలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.